సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్‌లో అంతర్మథనం కొనసాగుతోంది. జిల్లాలో పోలింగ్ సరళిపై టీ పీసీసీ ఆరా తీసింది. ఎన్ని స్థానాల్లో గెలుపు అవకాశాలున్నాయనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్‌రావు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జగన్నాథంతోపాటు, జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని జిల్లా నాయకులు టీ పీసీసీ ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అనుకూల పవనాల నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు.
వ్యతిరేకులపై చర్యలు తీసుకోండి..
సార్వత్రిక ఎన్నికల్లో కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని అభ్యర్థులు టీ పీసీసీ ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏపీపీఎస్సీ మాజీ డెరైక్టర్ రవీందర్‌రావు, కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన భరత్‌చౌహాన్‌లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా హరినాయక్ టీ పీసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీరు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేశారని హరినాయక్ పొన్నాల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని పొన్నాల స్పష్టం చేశారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికలపై..
మున్సిపాలిటీలు, ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చకొచ్చింది. అన్ని మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలతోపాటు, ఎలాగైనా జెడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని టీపీసీసీ నేతలు జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు.
అంతర్మథనం
Published Tue, May 6 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement
Advertisement