ప్రగతినగర్ : అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల నమోదును పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలలో మూడేళ్లు నిండిన పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎన్నిక చేయబడిన కేంద్రాలలో ఆంగ్లమాధ్యమంలో పిల్లలకు చదువు చెప్పడానికి కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాలలో కనీస వసతులు కల్పించాలని, మంజూరు చేసిన కేంద్రాలలో త్వరలో పూర్తిచేయడానికి తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు.
సొంతభవనాల కోసం ప్రతిపాదనలు పంపించండి
పట్టణ కేంద్రాలలో అద్దెకు గదులు లభించని పరిస్థితుల్లో పాఠశాలల పరిధిలో ఒక గదిని కేటాయించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న శిశు కేంద్రానికి అవసరమైన నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 989 కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు.
భవనాలు పూర్తి చేయడానికి ఇంటర్ డిపార్ట్‌మెంట్ సమన్వయ కమిటీ సమావేశాలలో సమస్యలు తెలుపాలన్నారు. పిల్లలకు, గర్భిణులకు ఐరన్ ఫోలిక్ మాత్రలు సమపాళ్లలో పంపిణీ చేయాలని, ఇందుకు అవసరమైన ఇండెంట్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారికి పంపించాలని సూచించారు. పౌష్టికాహారం అందించి పిల్లలు ఆ రోగ్యంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పీడీ రాములు, డీఈఓ శ్రీనివాసాచారి, అదనపు డీఎంహెచ్‌ఓ బసవేశ్వరి, ఎంపీడీఓ గీతారాణి, పీఆర్ రాజేంద్రప్రసాద్, వైద్యాధికారి నాగరాజు, సీడీపీఓ ఝూన్సీరాణి, ఏపీఆర్‌ఓ రాంమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీకి అర్హులను గుర్తించండి
మద్నూర్ : రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల వివరాలను అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆదేశించారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల గది, కంప్యూటర్ గది, తహశీల్దార్ చాంబర్‌ను పరిశీలించారు. అనంతరం బ్యాంకు అధికారులు,వీఆర్వోలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
రుణమాఫీకి ఆధార్ అనుసంధానం, బ్యాంకు ఖాతాల పరిశీలన, ఒకే కుటుంబంలో పంట రుణాలు పొందిన వారిని గుర్తించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. 2014-15 సంవత్సరానికి గాను పహాణీ తయారు చేశారా అని వీఆర్వోలను అడిగారు. పంట వివరాలను తప్పకుండా పహాణీలో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. జమాబందీ వివరాలను వచ్చే నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్ అనుసంధానం వంద శాతం పూర్తిచేయాలన్నారు. లెండి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని..ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జుక్కల్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను ఆయన మ్యాప్‌ను పరిశీలించారు.
పిల్లల నమోదుకు చర్యలు తీసుకోండి
Published Wed, Sep 24 2014 2:42 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement