
ప్రాణం తీసిన భూ తగాదా
పరిగి : భూ తగాదాలకు ఓ యువకుడు బలైపోయాడు. పాత కక్షలతో అతడిని అన్న, అక్కాబావలు కొట్టి చంపేశారు. తండ్రిపై తీవ్రంగా దాడిచేయగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నిందితులు పరారీలో ఉన్నారు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని నారాయణ్‌పూర్ శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండల పరిధిలోని బొంపల్లికి చెందిన ముద్దెం రామయ్యకు కుమారులు కృష్ణయ్య, శ్రీనివాస్(26)తో పాటు కూతురు నర్సమ్మ(30) ఉన్నారు. కూతురును కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన అంజిలయ్యకు ఇచ్చి వివాహం చేశాడు.
రామయ్య కుమార్తెకు కట్నంగా పరిగి మండలం నారాయణపూర్ గ్రామ శివారులో ఉన్న పొలంలో మూడెకరాలు రాసి ఇచ్చాడు. కూతురు, అల్లుడు సదరు భూమిని సాగుచేసుకుంటున్నారు. అయితే.. గతేడాది రామయ్య, గతంలో ఇచ్చిన భూమి కాకుండా మరోచోట పొలం తీసుకోవాలని కూతురు, అల్లుడికి చెప్పగా అందుకు వారు నిరాకరించారు. దీంతో అప్పటి నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. చిన్న కొడుకు శ్రీనివాస్, తండ్రి ఒకవైపు, పెద్ద కొడుకు కృష్ణయ్య, కూతురు నర్సమ్మ, అల్లుడు అంజిలయ్య మరో వర్గంగా తయారయ్యారు. గతంలో గొడవలు జరుగగా ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు నారాయణపూర్ శివారులో తమకు ఇచ్చిన భూమిలో నర్సమ్మ దంపతులు పత్తి విత్తనాలు నాటారు.
పథకం ప్రకారమే హత్య..
కూతురు, అల్లుడు తన మాట వినకపోవడంతో కోపం పెంచుకున్న రామయ్య శుక్రవారం ఉదయం చిన్న కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి పొలానికి వెళ్లాడు. కూతురు, అల్లుడు సాగుచేస్తున్న పత్తిపంటను ట్రాక్టర్‌తో దున్నారు. అనంతరం తండ్రీకొడుకు వామ విత్తనాలు వేసి పొలాన్ని చదును చేస్తున్నారు. 9 గంటల సమయంలో రామయ్య పెద్ద కొడుకు కృష్ణయ్య, కూతురు నర్సమ్మ, అల్లుడు అంజిలయ్యలు అక్కడికి వచ్చారు. ముందస్తు పథకంలో భాగంగా కర్రలు, ఇనుముతో చేసిన కర్రు తమతో తెచ్చుకున్నారు. వచ్చి రావటమే వారు గొడవకు దిగారు. తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా.. సాధారణమే అని శ్రీనివాస్ భావించి తన పనిలో నిమగ్నమయ్యాడు.
అతడిపై అన్న, అక్కాబావ కర్రలు, కర్రుతో తలపై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న రామయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. ఇదంతా పక్క పొలాల్లోని రైతులు చూస్తుండగానే జరిగింది. అనంతర ం కృష్ణయ్య, నర్సమ్మ, అంజిలయ్య అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పరిగి సీఐ ప్రసాద్, ఎస్‌ఐ నగేష్‌కుమార్, దోమ ఎస్‌ఐ భీమ్‌కుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రామయ్యను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, హత్యకు గురైన శ్రీనివాస్ గత సంవత్సరం ఎన్కెపల్లికి చెందిన యాదమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి 10 నెలల పాప ఉంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.