
తలసాని, తుమ్మల సహా ఆరుగురికి మంత్రి పదవులు
హైదరాబాద్: టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన సనత్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆరుగురి పేర్లతో కొత్త మంత్రుల జాబితాను రాజ్భవన్కు పంపారు.
శ్రీనివాస్ యాదవ్, తుమ్మలతో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన చందూలాల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మంగళవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
వీరి చేరికతో తెలంగాణ కేబినెట్లో మంత్రుల సంఖ్య 18కి చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. కాగా తాజా విస్తరణలో మహిళలకు స్థానం దక్కలేదు. సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు నిరసన చేపడుతున్నా జాబితాలో చోటు దక్కలేదు.