ఏమి సాధించారని సంబరాలు? | Tammineni questions govt on June 2 celebrations | Sakshi
Sakshi News home page

ఏమి సాధించారని సంబరాలు?

Published Wed, May 25 2016 6:51 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

Tammineni questions govt on June 2 celebrations

హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న సందర్భంగా ఏమి సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉన్నాయని.. కొన్ని వాగ్దానాల అమలు కనీస స్థాయిలో కూడా జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల అభివృద్ధికి రెండేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోకపోగా వారికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించరన్నారు. కేజీ టు పీజీ అమలుపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు భూ పంపిణీ ఏ మాత్రం ముందుకు సాగడం లేదని, రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి ఆతీగతీ లేదని, అందరికీ విద్య అనేది అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు.

విద్య,వైద్యరంగాల్లో పేదలకు తగిన న్యాయం జరగాలని, ఆయా సౌకర్యాల సాధన కోసం తమ పార్టీ ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టుల పేరుతో 4.5 లక్షల ఎకరాల రైతుల భూమిని ప్రభుత్వం కాజేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుల కింద నష్టపోయే భూములకు 2013 చట్టప్రకారం నిర్దేశించిన పరిహారం చెల్లించకుండా, పునరావాస చర్యలు చేపట్టకుండా దొంగదారిన జీవోలు తెచ్చిందని ధ్వజమెత్తారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అఖిలపక్షసమావేశాన్ని నిర్వహిస్తే ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 123, 214 రైతులకు ఏ విధంగా నష్టదాయకమో రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల ప్రభుత్వం ఏమి సాధించిందో అర్థం కావడం లేదన్నారు. పాలన సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటును తమ పార్టీ స్వాగతిస్తున్నా.. ప్రక్రియ పారదర్శకంగా సాగడం లేదన్నారు. జిల్లాల ఏర్పాటుపై రాష్ర్ట ప్రభుత్వ ప్రతిపాదనలను, ఆలోచనలను వెల్లడించకుండా కలెక్టర్లు ప్రతిపాదనలతో రావాలని చెప్పడం తప్పుడు పద్ధతి అని విమర్శించారు.

కరువు, ఇతర సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన తెచ్చారనే అభిప్రాయం కూడా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో వలసలే లేవని ఆ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక పచ్చి అబద్ధమన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటామని హామీ ఇచ్చి, మున్సిపల్, ఆశ తదితరుల సమ్మెలను సీఎం కేసీఆర్ క్రూరంగా అణచివేశారన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక 4 నెలల్లోనే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీనిచ్చి 24 నెలలు గడిచినా దానిపై ఏ చర్యా తీసుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement