టీడీపీనేత భూ దందా
గ్యాస్ గోదాం పేరిట
స్థలం కొట్టేసిన ఘనుడు
ఇప్పుడు ఫంక్షన్‌హాల్ నిర్మాణం
రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు ప్రణాళిక
కళ్లెదుటే జరుగుతున్నా స్పందించని అధికారులు
ఒక అక్రమం.. ఒక మోసం కలిసికట్టుగా అమీన్‌పూర్‌లో ఓ అధునాతన ఫంక్షన్ భవనం రూపుదిద్దుకుంటోంది. గ్యాస్ గోదాం కోసం కారు చౌకగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి పొందిన ఓ టీడీపీ నాయకుడు.. ఇప్పుడు రూట్ మార్చారు. కొట్టేసిన భూమికి మరికొంత స్థలం కబ్జాచేసి మొత్తం రూ. 3 కోట్ల విలువైన భూమిలో శరవేగంగా ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు. భవన నిర్మాణం పూర్తి చేసుకుని రెగ్యులైజేషన్ పథకం కింద స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.
సంగారెడ్డి : ‘బక్క’చిక్కిన సామాన్యునికి ఇంటి స్థలం కోసం 60 గజాలు ఇవ్వమని అడిగితే 120 ఆంక్షలు పెట్టే అధికారులు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు మాత్రం ప్రత్యేక జీఓలు తెచ్చి అప్పనంగా 20 గుంటల స్థలాన్ని కట్టబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలుగుదేశం పార్టీ నాయకునికి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. ఈ ఏజెన్సీకి జోగిపేట పట్ణణంలో గ్యాస్ గోదాం ఉంది. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు.
అయితే తాను పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లో గ్యాస్ గోదాం నిర్మాణం చేసుకుంటానని, ఇందుకు స్థలం కేటాయించాలని టీడీపీ నాయకుడు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రస్తుత ఏపీ సీఎం హవా నడవడంతో ఆయన సిఫార్సు మేరకు పటాన్‌చెరు మండలం అమీన్‌పుర్‌లోని సర్వే నంబర్ 993లో 20 గుంటల స్థలాన్ని నామమాత్రపు రుసుంతో కేటాయిస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై అప్పట్లోనే నిరసనలు వ్యక్తం అయ్యాయి.
రెవెన్యూ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీ సంస్థ నుంచి గోదాం బదిలీకి ఎలాంటి అనుమతి లేకుండానే భూమి కేటాయించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గోదాంను జోగిపేట నుంచి అమీన్‌పూర్‌కు తరలించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. పైగా ఒక ప్రైవేటు ఏజెన్సీకి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం నిబంధనలు అంగీకరించవు. అయినా అప్పటి ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా భూమిని ఆయనకు దారాదత్తం చేసింది.
శరవేగంగా నిర్మాణం
తాజాగా ఇదే భూమిలో సదరు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆధునిక సౌకర్యాలు, అదనపు హంగులతో ఓ పంక్షన్‌హాల్ నిర్మాణం చేస్తున్నారు. గ్యాస్ గోదాం నిర్మాణం పేరుతో గ్రామ పంచాయతీ అనుమతి పొందిన ఆయన, ఏకంగా ఫంక్షన్ హాల్ కడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 20 గుంటల స్థలానికే ఆనుకొని ఉన్న మరికొంత ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి శరవేగంగా భవన నిర్మాణం చేస్తున్నారు. ప్రజల ఫిర్యాదుల మేరకు భవన నిర్మాణాన్ని తనిఖీ చేసిన రెవిన్యూ అధికారులు కూడా ఫంక్షన్ హాల్ కడుతున్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పటాన్‌చెరు తహశీల్దారు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు.
మండల స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారికి, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదికలు అంది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలోపే భవన నిర్మాణం పూర్తి చేసుకుని రెగ్యులైజేషన్ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి సదరు నాయకుడు పథకం వేసినట్లు సమాచారం. అదే జరిగితే దాదాపు రూ 2.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి టీడీపీ నాయకుని చేతిలోకి వెళ్లిపోయినట్లేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై పటాన్‌చెరు తహశీల్దారు మహిపాల్‌రెడ్డిని వివరణ కోరగా, సదరు టీడీపీ నేత కడుతున్న భవన నిర్మాణంపై ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ జరిపించామని, తమ విచారణలో అతను ఫంక్షన్ హాల్ కడుతున్నట్లు తేలిందన్నారు. ఈమేరకు నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన వివరించారు.