మహానాడుకు రేవంత్ డుమ్మా
తుమ్మల నాగేశ్వరరావు కూడా గైర్హాజరు
హైదరాబాద్: టీడీపీ కార్యక్రమాల్లో ముందుండి హల్‌చల్ చేసే కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు తొలిరోజు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. మల్కాజిగిరి ఎంపీ సీటును ఆశించి భంగపడ్డ ఆయన గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కొంత గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలన్న ఆలోచనతో ఉన్న టీఆర్‌ఎస్.. టీడీపీ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదేకాకుండా మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ ఇప్పటికే టీడీపీ జెడ్పీటీసీలతో ఓ అవగాహనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీలను తెలుగుదేశం కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌కు రేవంత్‌రెడ్డి మద్దతు తప్పనిసరైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలు రేవంత్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహానాడు వంటి కార్యక్రమానికి రేవంత్ గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది.
అలాగే ఖమ్మంలో అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా మహానాడుకు గైర్హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రత్యర్థి వర్గీయుడైన నామా నాగేశ్వరరావుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న బాబు.. తనను పక్కన పెట్టారని తుమ్మల భావిస్తున్నారు. కాగా మహానాడుకు గైర్హాజరు కావడానికి గల కారణాలపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా... ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం ఆలస్యమైందని, పెళ్లిళ్లకు హాజరు కావాల్సి ఉండడంతో మహానాడుకు రాలేకపోయినట్లు చెప్పారు. తాను రెండ్రోజులు ఢిల్లీలో చంద్రబాబుతోనే ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఇక తుమ్మల వ్యక్తిగత కారణాలతో మహానాడుకు వెళ్లలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తుమ్మల ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.