
8 జిల్లాలకు టీడీపీ అధ్యక్షుల నియామకం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం దాదాపుగా పూర్తయ్యింది.
హైదరాబాద్, వరంగల్‌పై పీటముడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం దాదాపుగా పూర్తయ్యింది. హైదరాబాద్, వరంగల్ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అవి మినహా మిగతా జిల్లాల అధ్యక్షుల పేర్లను ఆదివారం ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజించి తూర్పు, పశ్చిమలకు ఇద్దరు అధ్యక్షులను ప్రకటించారు. ఆదివారం చంద్రబాబు నివాసంలో తెలంగాణ నేతలు సమావేశమై ఏకాభిప్రాయం వ్యక్తమైన 8 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించాలని ఎన్నికల కన్వీనర్ ఇ. పెద్దిరెడ్డికి సూచించారు.
హైదరాబాద్‌లో బీసీ వర్గానికి చెందిన కృష్ణయాదవ్ స్థానంలో మాగంటి గోపీనాథ్‌ను నియమిస్తే విమర్శలు వెల్లువెత్తుతాయోమోనన్న అనుమానాన్ని బాబు వ్యక్తం చేయగా, ఎమ్మల్యే సాయన్న అలాంటిదేమీ ఉండదని బాబుకు వివరించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా వెలమ సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హన్మంతరావును నియమించినప్పుడు, కమ్మ వర్గానికి చెందిన గోపీనాథ్‌ను నియమించడం వల్ల ఎలాంటి సమస్య రాదని స్పష్టం చేసినట్లు సమాచారం. దాంతో ఓసారి కృష్ణయాదవ్‌తో మాట్లాడి గోపీనాథ్ పేరు ప్రకటించమని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. వరంగల్‌లో రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కలలో ఒకరికి అధ్యక్ష పదవి ఇప్పించాలని ఎర్రబెల్లి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. వారు అయిష్టంగా ఉండడంతో గండ్ర సత్యనారాయణను నియమించే అవకాశం ఉంది.
టీడీపీ జిల్లాల అధ్యక్షులు వీరే..
ఆదిలాబాద్ తూర్పు: బోడ జనార్దన్, ఆదిలాబాద్ పశ్చిమ: లోలం శ్యాంసుందర్, నిజామాబాద్: అరికెల నర్సారెడ్డి, కరీంనగర్: సి.హెచ్. విజయరమణారావు, మెదక్: శశికళ యాదవరెడ్డి, రంగారెడ్డి: ప్రకాశ్ గౌడ్, మహబూబ్‌నగర్: బక్కని నర్సింహులు, నల్లగొండ: బిల్యా నాయక్, ఖమ్మం: తుళ్లూరి బ్రహ్మయ్య.
ముమ్మరంగా మహానాడు ఏర్పాట్లు
టీడీపీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు జరిగే మహానాడుకు గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణం సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాల్లోని 30 వేల మంది ప్రతినిధులను దృష్టిలో ఉంచుకొని సభాప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా చంద్రబాబు, ఇతర ముఖ్య నేతలు ఆసీనులయ్యే వేదిక కు మూడు వైపులా 100 టన్నుల సామర్థ్యంగల ఏసీలను ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. వందేమాతరం శ్రీనివాస్, రాఘవేంద్రరావు వీటిని పర్యవేక్షించనున్నారు.