గజ్వేల్, న్యూస్‌లైన్: ఓటమి భారంతో కుంగిపోతున్న గజ్వేల్ నియోజకవర్గ టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన గజ్వేల్, జగదేవ్‌పూర్ జెడ్పీటీసీలు జెజాల వెంకటేశంగౌడ్, ఎంబారి రామచంద్రం గురువారం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అగ్రనేత హరీష్‌రావు వీరికి పార్టీ కండువాలు కప్పి గులాబీదళంలోకి
ఆహ్వానించారు. కొద్దిరోజుల క్రితమే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన ఈ ఇద్దరు జెడ్పీటీసీలు గురువారం అధికారికంగా గులాబీ కండువా కప్పుకోవడంతో తెలుగుతమ్ముళ్లంతా షాకయ్యారు. గజ్వేల్, జగదేవ్‌పూర్‌లలో టీడీపీకి పట్టుసాధించిన ఈ ఇద్దరు నేతలు ఇక నుంచీ టీఆర్‌ఎస్ పక్షాన పనిచేయనుండడంతో ఆ పార్టీ నేతలంతా తలలు పట్టుకుంటున్నారు.
జోరుమీదున్న కారు
గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టడం లాంఛనమే కావడంతో నియోజకవర్గంలోని అన్ని పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ముగ్గురు జెడ్పీటీసీలు, 36 మంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరటం ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇదే క్రమంలో టీడీపీ నుంచి సైతం వలసలు ప్రారంభం కావడంతో మిగతా ఎంపీటీసీలు , సర్పంచ్‌లు, సైతం టీఆర్ ఎస్‌లో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
గజ్వేల్ టీడీపీకి షాక్
Published Thu, May 22 2014 11:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement