నీటి పారుదల మంత్రిగా ఏం చేశారు?  | Harish Rao Faire To Sunitha Reddy At Gajwel | Sakshi
Sakshi News home page

నీటి పారుదల మంత్రిగా ఏం చేశారు? 

Published Fri, Nov 16 2018 10:04 AM | Last Updated on Fri, Nov 16 2018 10:33 AM

Rarish Rao Faire To Sunitha Reddy At Gajwel - Sakshi

గజ్వేల్‌: మంత్రిగా పనిచేసిన కాలంలో సునీతారెడ్డి జిల్లాకు ఒరగబెట్టిందేమీలేదని, ప్రస్తుతం నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి తిరిగి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నర్సాపూర్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంటే ముందు పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి, నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామంటూ సునీతారెడ్డికి సవాల్‌ చేశారు. మీ పాలనలో ఎరువులు, విత్తనాల కొరత, దొంగరాత్రి కరెంటు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. నీటి పారుదలశాఖ నిర్వహించినా ఒక్క చెరువు కట్టను కూడా బాగుచేయలేకపోయారని విమర్శించారు.

మాట తప్పడం కాంగ్రెస్‌ నైజమైతే... ప్రజలకు చెప్పింది అక్షరాల నెరవేర్చడం టీఆర్‌ఎస్‌ ఘనత అంటూ పేర్కొన్నారు. పోరాడి తెలంగాణను సాధించడమేగాకుండా 24గంటల కరెంటు ఇస్తామంటే... ఇచ్చినం. కల్యాణలక్ష్మీ పథకం కులం, మతం తారతమ్యం లేకుండా అందజేసినం. కేసీఆర్‌ కిట్‌ అందజేసి పేదల కళ్లల్లో ఆనందం చూసినం. రైతు బీమా, రైతు బంధు అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచినం. మిషన్‌ భగీరథతో స్వచ్ఛమైన నీటిని అందించగలిగామని వివరించారు.

అందువల్లే టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో నేడు చెరగని విశ్వాసం ఉందన్నారు. నేడు కాంగ్రెసోళ్లు ఇది కాలేదు... అది కాలేదంటే జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. మీ చెవుల్లో పువ్వులు పెట్టుకోగలుగుతారేమో కానీ.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  


ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు పది స్థానాలు 
జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): గజ్వేల్‌ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం రాత్రి జగదేవ్‌పూర్‌ మండలం రాయవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ చంద్రంతో పాటు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు 40 మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లోని ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరిగాయని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ ఇటివల గజ్వేల్‌ నియోజకవర్గ టీఆర్‌స్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అనంతరం ప్రతిపక్ష పార్టీలన్ని ఖాళీ అవుతున్నాయని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు పది టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో జగదేవ్‌పూర్‌ మండల ఎన్నికల సమన్వయకర్త రాధాకృష్ణశర్మ, మండలాధ్యక్షులు రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.  

గజ్వేల్‌ దశ మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే 
గజ్వేల్‌: కేసీఆర్‌ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో చేపట్టిన అభివృద్ధిని కార్యకర్తలు, నాయకులు గడపగడపకు తీసుకెళ్లాలని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ హరితా రెస్టారెంట్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు ఊడెం కృష్ణారెడ్డి నేతృత్వంలో అనంతరావుపల్లి, బూర్గుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ గజ్వేల్‌కు కొత్తరూపు తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. ఒకప్పుడు కనీస అవసరాలకు దూరంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని నేడు అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దగలిగామన్నారు.

కేసీఆర్‌ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన వినూత్న పథకాలన్నీ ఇక్కడ నుంచే ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు. ఒకప్పుడు గుర్తింపు లేకుండా ఉన్న గజ్వేల్‌ ప్రాంతం.. కేసీఆర్‌ ప్రాతినిథ్యంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిందని చెప్పారు. ఇదే అభివృద్ధి పరంపర కొనసాగాలంటే ప్రజలంతా మూకుమ్మడిగా కేసీఆర్‌ అభ్యర్థిత్వాన్ని బలపర్చి లక్ష ఓట్ల మెజార్టీని కానుకగా ఇవ్వాలన్నారు. నాయకులు, కార్యకర్తలు 20 రోజుల పాటు శక్తివంచన లేకుండా శ్రమిస్తే ఆ తర్వాత ఐదేళ్లు కడుపులో పెట్టి చూసుకుంటామని హామీ ఇచ్చారు.

పార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని చెప్పారు. నేడు ప్రజలకు అభివృద్ధి తీరు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

టీఆర్‌ఎస్‌లో చేరుతున్న అనంతరావుపల్లి, బూర్గుపల్లికి చెందిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement