రోదిస్తున్న కుటుంబ సభ్యులు, గంగాధర్(ఫైల్)
కోరుట్ల/కథలాపూర్ : బడి పునఃప్రారంభమైన మొదటి రోజే గుండెపోటుతో ఓ ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటనతో విషాదం నెలకొంది. కథలాపూర్ మండలం దూలూరుకు చెందిన యాగండ్ల గంగాధర్(38) కోరుట్లలోని డాక్‌బంగ్లా ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్నారు. స్థానిక ఆదర్శనగర్‌లో నివసిస్తున్నారు. మొదటిరోజు శుక్రవారం ఉదయం 8 గంటలకే పాఠశాలకు వెళ్లారు. ప్రార్థన అనంతరం ఉపాధ్యాయులతో తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించి తరగతిగదికి వెళ్లి పిల్లలతో కొంతసేపు గడిపారు.
అనంతరం ఉద యం 11 గంటలకు విరామ సమయంలో కార్యాల యంలో ఉండగా చాతిలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రధానోపాధ్యాయు డు ప్రతాప్, మిగిలిన ఉపాధ్యాయులు గంగాధర్‌ను కారులో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. గంగాధర్ మృతితో ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. అనంతరం మృతదేహాన్ని గంగాధర్ ఇంటికి తరలించారు. గంగాధర్‌కు భార్య సునీత, కూతుళ్లు రిషిత, రోషిణి ఉన్నారు. గంగాధర్ 2002 డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగంలో చేరారు. మండలంలోని గంభీర్‌పూర్, సిరికొండల్లో పనిచేశారు. కథలాపూర్ ఎంఈవో కార్యాలయంలో ఎమ్మార్పీగా పనిచేశారు. నాలుగేళ్ల క్రితం కోరుట్ల మండలానికి బదిలీపై వెళ్లారు.
రెండు రోజులుగా చాతినొప్పి..
సెలవుల్లో భార్య పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన యాగండ్ల గంగాధర్ రెండు రోజులుగా చాతినొప్పితో బాధపడుతున్నాడు. సాధారణంగా అజీర్థితో వచ్చే సమస్యగా భావించిన గంగాధర్ స్థానిక ప్రైవేటు వైద్యులకు చూపించుకుని మందులు వాడా డు.నొప్పి తగ్గకపోవడంతో గురువారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయింకుని మందులు వాడుతున్నాడు. గురువారం రాత్రి కొంత అస్వస్తతతో ఉన్నట్లుగా గమనించిన భార్య సునీత, పిల్లలు గంగాధర్‌ను బడికి వెళ్లవద్దని వారించారు. అయినప్పటికీ మొదటి రోజు కావడంతో తప్పక ండా విధులకు వెళ్లాలని పట్టుబట్టిన గంగాధర్ పాఠశాలలోనే గుండెనొప్పితో ప్రాణాలు వదిలాడు.
ఇద్దరు కూతుళ్లే..
యాగండ్ల గంగాధర్‌కు భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు రిషిత, రోషిణి ఉన్నారు. భార్య సునీత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం వరకు ఆరోగ్యంగా ఉన్న గంగాధర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సకాలంలో అందని వైద్యం
యాగండ్ల గంగాధర్ పాఠశాలలో చాతినొప్పితో కుప్పకూలగానే ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్, ఉపాధ్యాయులు కలిసి వెంటనే స్థానికంగా ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మరో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడా వైద్యుడు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ గంగాధర్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. సకాలంలో అందని వైద్యం కారణంగా గంగాధర్ ప్రాణాలు వదిలారు. గంగాధర్ మృతిపై ఎంఈవోలు గంగుల నరేశం, ఆనంద్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment