ఎమ్మెల్యేల సేవలో టీచర్లు
అక్రమ డెప్యుటేషన్లకు ప్రజాప్రతినిధి మద్దతు
- విద్యాహక్కు చట్టానికి తూట్లు
- పాఠశాలలో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
- మూసివేత దిశగా సర్కార్ బడులు
సిరిసిల్ల రూరల్ : ప్రభుత్వ జీవో ఎంఎస్ నం.476 జీఏ(ఎస్‌ఆర్) ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎమ్మెల్యేలకు పీఏలుగా నియమించొద్దు.. అయితే ఇవి ఎక్కడా అమలు కావడంలేదు. తమకు నచ్చిన ఉపాధ్యాయులను అక్రమంగా డెప్యుటేషన్లపై పీఏలుగా నియమించుకుని డ్యూటీ చేయకుండానే ప్రజాధనాన్ని వేతనంగా ఇవ్వడానికి పావులు కదుపుతున్నారు. దీంతో వారు పనిచేసే పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. మరికొన్ని సర్కార్ స్కూళ్లు మూతపడుతున్నాయి.
జగిత్యాల డివిజన్ పరిధిలోని ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సిరిసిల్ల మండలం రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అనిల్‌రావును వదలడంలేదు. గతేడాది కూడా డెప్యుటేషన్‌పై పీఏగా నియమించుకుని పాఠశాలలో విధులు నిర్వహించకుండా చే శారు. ఈ ఎమ్మెల్యే పుణ్యమా అని విద్యార్థుల సంఖ్య 24 నుంచి 11కు పడిపోయింది. ఈ విద్యా సంవత్సరంలోనూ అనిల్‌రావు పాఠశాల ప్రారంభరోజు విధుల్లో చేరి ఈ తర్వాత నుంచి డుమ్మా కొడుతున్నాడు. ఎలాంటి సెలవు చీటి పెట్టకుండా ఫోన్‌లో చెప్పి మళ్లీ ఆ ఎమ్మెల్యేకు పీఏగా వెళ్లడానికి పైరవీలు ప్రారంభించినట్లు తెలిసింది.
ఇప్పటికే సదరు ఎమ్మెల్యే ఒత్తిడితో కలెక్టర్ సంతకం పూర్తయి డీఈవోకు జాబితా వెళ్లినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు, ఎస్‌ఏంసీ సభ్యులు అనిల్‌రావును ఎమ్మెల్యేకు పీఏగా నియమించవద్దని, తమ పిల్లల భవిష్యత్ అంధకారమవుతుందని కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. చదువు చెప్పడం ఇష్టం లేకుంటే తమ గ్రామం నుంచి పంపించి తమకు మరో ఉపాధ్యాయుడిని కేటాయించాలని కోరారు. గతేడాది ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సిరిసిల్ల మండల చిన్నలింగాపూర్ ఉపాధ్యాయుడిని పీఏగా పంపించడంతో పిల్లల సంఖ్య తగ్గి ఏకంగా పాఠశాలనే మూసివేశారు.
ఇప్పుడు రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల కూడా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వాహకంతో మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు ప్రజలకు అనుగుణంగా ఉండాలని, చట్టాలాను గౌరవించి విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులను పీఏలుగా నియమించుకోవద్దని పేర్కొంటున్నారు. ఈ అక్రమ డెప్యుటేషన్లపై ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆందోళన నిర్వహిస్తున్నా లాభం లేకుండా పోతోంది.
నోటీసులు జారీ చేస్తా..
- దూస రఘపతి, సిరిసిల్ల ఎంఈవో
సెలవు చీటి లేకుండా పాఠశాలకు రావడం లేదని నా దృష్టికి వచ్చింది. ఈ విషయం నిన్ననే తెలిసింది. సదరు ఉపాధ్యాయునికి, ఎంఈవోకు రిపోర్టు చేయని హెచ్‌ఏంకు సైతం నోటీసులు జారీచేసి వివరణ కోరుతా. డీఈవోకు నివేదిక పంపిస్తా. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.