అతడొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇన్‌చార్జ్ హెచ్‌ఎం కూడా. అతడి బుద్ధి వక్రించింది. కీచకుడిగా మారాడు. పదోతరగతి మార్క్స్ మెమో కోసం పాఠశాలకు వచ్చిన బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి, ఉపాధ్యాయ లోకానికి తలవంపులు తెచ్చాడు. ‘తులసి వనంలో గంజాయి మొక్క’గా మారాడు.
వేంసూరు: మండలంలోని కల్లూరుగూడెం గ్రామానికి చెందిన ఆ విద్యార్థిని స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పదోతరగతి ఉత్తీర్ణురాలైంది. సత్తుపల్లిలోని ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పదోతరగతి లాంగ్ మెమో కోసం సోమవారం పాఠశాలకు వెళ్లింది. ప్రధానోపాధ్యాయుడు (మండల ఇన్‌చార్జ్ ఎంఈఓ) సిహెచ్.వెంకటేశ్వరరావు లేరు. ఖమ్మంలో సమావేశానికి వెళ్లారు. ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు డి.వెంకటేశ్వరరెడ్డి ఉన్నాడు. ఆపీస్ రూమ్‌కు వచ్చిన ఆ విద్యార్థినితో అతడు అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు.
ఆమె భయపడింది. తప్పించుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో చెప్పింది. వారు పాఠశాలకు చేరుకునేసరికి వెంకటేశ్వరరెడ్డి వెళ్లిపోయాడు. వారు అదే రోజున (ఇన్‌చార్జ్) ఎంఈఓకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. ఆ ఉపాధ్యాయుడిని మంగళవారం ఉదయం పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి పాఠశాలలో ఉన్న (ఇన్‌చార్జ్) ఎంఈఓ వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. డి.వెంకటేశ్వరరెడ్డిని పిలిపించకపోవడంతోపాటు సర్దిపుచ్చేందుకు వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. దీనిపై తల్లిదండ్రులు, 150మంది గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
ఎంఈఓ నిర్బంధం
కీచకుడిగా మారిన డి.వెంకటేశ్వరరెడ్డిని పాఠశాలకు పిలిపించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇన్‌చార్జ్ ఎంఈఓను గ్రామస్తులు నిర్బంధించారు. ‘‘గతంలో కూడా ఇదే పాఠశాలలోని అమ్మాయిలతో వేరొక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని మీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు మరొకడు తయారయ్యాడు. ఇదంతా మీ చాతగానితనంతోనే టీచర్లు ఇలా తయారవుతున్నారు’’ అంటూ నిర్బంధించారు. ఆ కీచకోపాధ్యాయుడు వచ్చేదాకా వదిలేది లేదన్నారు. ఈ సమాచారంతో ఎస్సై వెంకన్న, తహసీల్దార్ ఎన్‌టీ ప్రకాష్‌రావు వచ్చారు. చర్యలు తీసుకుంటామని వారు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.
పురుగుల మందు డబ్బాతో అన్న ఆందోళన
తన చెల్లితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని పాఠశాలకు రప్పించకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితురాలి అన్న, పాఠశాల భవనం పైకి ఎక్కాడు. అతడికి గ్రామస్తులు నచ్చచెప్పి కిందకు దించారు. తన కూతురుతో ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ (ఇన్‌చార్జ్) ఎంఈఓ వెంకటేశ్వరరావుకు బాలిక తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకుంటానని బాధితురాలి తండ్రికి లిఖితపూర్వక హామీ పత్రాన్ని (ఇన్‌చార్జ్) ఎంఈఓ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment