
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న సుడిగాలి ఏర్పాట్లకు అనూహ్య రీతిలో అడ్డంకి ఎదురైంది. ఈనెల 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించాలన్న ఈసీఐ నిర్ణయానికి దాదాపుగా బ్రేక్ పడింది. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ‘ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ’ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేమంటూ జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు చేతులెత్తేశారు. ఆ గడువును మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ 13 జిల్లాల కలెక్టర్లు గురు, శుక్రవారాల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌కు లేఖలు రాశారు. ఈ విషయాన్ని ఈసీఐ దృష్టికి తీసుకెళ్లి గడువుకు మరో 7 రోజుల మినహాయింపు కోరాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు గురువారం రజత్‌కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం కలెక్టర్లు ఇదే అంశాన్ని తేల్చి చెప్పినట్లు తెలిసింది.
సాంకేతిక ఇబ్బందుల వల్లే...
గత నెల 6న శాసనసభ రద్దు కావడంతో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం గత నెల 10 నుంచి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు కలిపి 13,15,234 దరఖాస్తులొచ్చాయి. వీటిని ఈ నెల 4వ తేదీలోగా పరిష్కరించి ‘ఈఆర్వో నెట్’ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉండగా, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ‘‘దరఖాస్తు స్వీకరించి 7 రోజులు గడవకముందే ఉత్తర్వులు జారీ చేయరాదు’’ అని ఈఆర్వో నెట్ వెబ్‌సైట్ నుంచి అలర్ట్ వస్తుండడంతో గడువు ముగిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తుల కంప్యూటరీకరణ పెండింగ్‌లో ఉండిపోయింది. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 4,501 దరఖాస్తులు, అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. మరోవైపు ఈ నెల 8న తుది ఓటర్ల జాబితాలను ప్రకటించాలని ఈసీఐ నిర్దేశించిన గడువు ముంచుకొస్తుండటంతో కలెక్టర్లు ఆందోళన చెంది తమ ఇబ్బందులను సీఈఓకి ఏకరువు పెట్టారు. ‘ఈఆర్వో నెట్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడింగ్ పని మినహా నిబంధనల ప్రకారం చేయాల్సిన ఇతర పనులన్నీ పూర్తి చేశామని తెలిపారు.
తలకిందులైన షెడ్యూల్ అంచనాలు..
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి కనీసం మూడు నెలల సమయం అవసరం కాగా, రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కేవలం నెల రోజుల వ్యవధితో ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. వాస్తవానికి గత జూలైలో రాష్ట్రంలో ప్రారంభమైన ఓటర్ల జాబితా తొలి సవరణ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరిలో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాదే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్న ఈసీఐ.. ఓటర్ల జాబితా తొలి సవరణ కార్యక్రమాన్ని నిలుపుదల చేసి రెండో సవరణ కార్యక్రమానికి కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు బూత్ స్థాయి అధికారి(బీఎల్‌ఓ) నుంచి జిల్లా కలెక్టర్ల వరకు గత నెల 10 నుంచి ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. అయితే, ఊహించని రీతిలో సాంకేతిక అడ్డంకులు ఎదురుకావడంతో ఆ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న తుది ఓటర్ల జాబితాల ప్రకటన అసాధ్యమేనని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం గడువు సడలిస్తే ఈ నెల 15న లేదా ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాలను ప్రకటించే అవకాశముంది.
ఈసీఐకు సీఈఓ నివేదిక!
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్‌లోగా సాధ్యం కాదంటూ కలెక్టర్లు లేఖలు రాసిన విషయంపై సీఈఓ రజత్ కుమార్ ఈసీఐకి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. సీఈఓ వెబ్‌సైట్ల ప్రామాణీకరణ అంశంపై ఢిల్లీలో శుక్రవారం ఈసీఐ నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన ఈ మేరకు నివేదిక అందజేసినట్లు సమాచారం. దీనిపై త్వరలో ఈసీఐ నిర్ణయం తీసుకునే అవకాశముంది.