సాక్షి, హైదరాబాద్: అది ఫిబ్రవరి 6, 2019.. బర్కత్‌పురకు చెందిన పదిహేడేళ్ల మేఘన(పేరు మార్చాం) ఎప్పటిలాగే ఇంటర్ కాలేజ్‌కు వెళ్లేందుకు బస్‌స్టాప్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల భరత్ అనే యువకుడు ఆమె రాక కోసం ఓమూల నక్కి ఉన్నాడు. తన ప్రేమను అంగీకరించని ఆ యువతిని చంపేయాలని కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో నిల్చున్నాడు. ఆమె కనిపించగానే రాక్షసుడిలా మారిపోయాడు. ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు చేరుకుని వరుసగా పదిహేడు సార్లు కత్తితో పొడిచాడు. రక్తం కారుతూ కొన ఊపిరితో కొట్టుకుంటున్నా అతడు వదిలేయలేదు. కసి తీరా పొడిచి అక్కడ నుంచి పరారయ్యాడు.అప్పటివరకు భయంతో బిగుసుకుపోయిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎలాగోలా ఆమె చావు నుంచి బయటపడింది, కానీ జీవితమే చీకటి అయింది. (బీర్ సీసాతో భార్యపై దాడి)
బాగా చదివి విదేశాలకు వెళ్లాలన్న ఆమె కల అర్ధాంతరంగా ఆగిపోయింది. శారీరకంగా, మానసిక ఆరోగ్యం దెబ్బ తింది. ఈ దారుణం జరిగి ఏడాదికి పైనే అవుతోంది. ఈ కేసులో నిందితుడికి సోమవారం కోర్టు పదేళ్ల జైలు విధించింది. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. 'ఒకప్పుడు నా బిడ్డ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మౌనంగానే ఉంటోంది. మళ్లీ పాత గాయాలను గుర్తు చేయడం ఇష్టం లేక దోషికి శిక్ష పడిందన్న విషయాన్ని కూడా ఇప్పటివరకు ఆమెకు చెప్పనేలేదు'అని తెలిపారు. తన కూతురికి కూతురికి జరిగిన ఘోరానికి సాక్ష్యంగా నిలిచిన బర్కత్‌పురను వదిలి ఆ కుటుంబం వేరే ప్రాంతంలో నివసిస్తోంది. ప్రస్తుతం మేఘన బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇప్పటికీ ఆమె కాలేజ్‌కు వెళ్లాలంటే బస్‌స్టాప్ వరకు ఒకరు తోడుగా వెళ్లాల్సిందే. (తల్లీ, కూతుళ్లపై హత్యాయత్నం)
Comments
Please login to add a commentAdd a comment