ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): ప్రేమించి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు యువతిపై హత్యాయత్నానికి పాల్పడి, తానూ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లి బాపూజీనగర్‌లో నివాసముండే నందు, జ్యోతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. నందు ఆర్టీసీ మెకానికల్ డిపోలో పనిచేసి రిటైరయ్యాడు. నందు పెద్ద కుమార్తె చామంతి(22) ఆర్నెళ్లుగా స్థానిక ఘన్‌శ్యామ్ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తోంది. ఐదేళ్లక్రితం మారేడుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో తన క్లాస్‌మేట్ ద్వారా యాప్రాల్‌కు చెందిన గిరీష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇటీవల అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ఈక్రమంలో చామంతిని తాను పెళ్లి చేసుకుంటానంటూ గిరీష్ ఆమె తల్లిదండ్రులను కలిసి ఒప్పించే ప్రయత్నం చేశాడు. దినేశ్‌తో పెళ్లికి చామంతి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇంటికొచ్చి వేధింపులకు గురి చేశాడు. దీంతో నందు గత నెలలో బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గిరీష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోర్టులో రూ.50 జరిమానా
గిరీష్ వేధింపుకుల సంబంధించిన కేసు విచారణ బుధవారం సికింద్రాబాద్ కోర్టులో జరిగింది. గిరీష్‌ను మందలించిన కోర్టు అతనికి రూ.50 జరిమానా విధించింది. మళ్లీ చామంతి జోలికి వెళ్లనని హామీ ఇచ్చిన గిరీష్, జరిమానా చెల్లించి బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికెళ్లే క్రమంలో చామంతి, గిరీష్‌ల మధ్య మళ్లీ వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో చామంతికి ఇంటికెళ్లి ఆమెను బయటకు పిలిచాడు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో చామంతి పొట్టలో పొడిచాడు. గిరీష్‌ను అడ్డుకునే క్రమంలో చామంతి చేతిపై మరో గాటు పడింది. చామంతి తల్లిదండ్రులు కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంతలోనే గిరీష్ తనను తాను కత్తితో పొడుచుకుని బాల్కనీలో పడిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీమ్‌తో సహా పోలీసు సిబ్బందికి అక్కడికి చేరుకున్నారు. గిరీష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, చామంతికి స్థానిక వీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment