చైతన్యపురి: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కూరగాయల చాకుతో భర్త మెడపై భార్య దాడి చేయటంతో చనిపోయాడు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 6వ తేదీ సాయంత్రం జరిగిన ఈ ఉదంతం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ సీతా రాం తెలిపిన వివరాల ప్రకారం...
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బసిరెడ్డిగూడెంకు చెందిన మురళీధర్‌రెడ్డి (42), మిర్యాలగూడకు చెందిన మౌనిక (25)లకు 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు సరూర్‌నగర్ శ్రీసాయికృష్ణనగర్ కాలనీలో ఉంటున్నారు. మురళీధర్‌రెడ్డి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. కాగా, డిగ్రీ పరీక్ష రాసేందుకు గుంటూరు వెళ్లిన మౌనిక ఈనెల 6న సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. నీవు లేనప్పుడు నీగురించి నాన్న అందరికీ చెడుగా చెప్పాడని కుమారుడు తల్లికి చెప్పాడు.
దీంతో భర్తను ఆమె నిలదీసింది. ఇష్టం లేకపోతే వదిలేయమని గొడవకు దిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మౌనిక వంటగదిలోని చాకుతో భర్త మెడపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తపు మడుగులో మురళీధర్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. విషయం చుట్టుపక్కల ఫ్లాట్ల వారికి తెలిసి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ మురళీధర్‌రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు భార్యను విచారించగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిసింది. మురళీధర్‌రెడ్డి భార్యను అనుమానించి వేధించేవాడని, ఈక్రమంలోనే కడతేర్చిందని గుర్తించారు. సోమవారం మౌనికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment