సమగ్ర సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
మిర్యాలగూడ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిరంజీవులు సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలతో పాటు మున్సిపల్ కార్యాలయంలో నోడల్ అధికారులకు సర్వే కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. సిబ్బంది సరిపడా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11లక్షల20వేల కుటుం బాలను సర్వే చేయనున్నట్లు తెలిపారు.
సమగ్ర సర్వేకు 42 వేల మంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సర్వేపై ప్రజ లు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నా రు. ఏ ప్రాంతంలో ఉన్న వారు అక్కడే తమ సమాచారాన్ని అందించవచ్చని సూచి ంచారు. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితి గతులను తెలుసుకోవడానికే సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 33 వేల తెల్లరేషన్ కార్డులు తొలగించామన్నారు. వీటిలో 10 వేల కార్డులను తహసీల్దార్ కార్యాలయాల్లోని బాక్సుల్లో స్వచ్ఛందంగా వేసినట్లు తెలిపారు. సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ సర్వే ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఆయన వెంట ఆర్డీఓ కిషన్‌రావు, మున్సిపల్ కమిషనర్ సురే ష్, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ వసంత, ఎంపీడీఓ శ్రీరామకృష్ణ, మండల సూపర్‌వైజర్ జూల కంటి వెంకట్‌రెడ్డి, ఏఓ జయప్రద, ఏఎస్‌ఓ ఆశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలు గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి
తిప్పర్తి : జిల్లాలో మంగళవారం నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే కోసం ప్రజలు తగిన గుర్తింపుకార్డులను సిద్ధంగా ఉంచుకుని ఎన్యుమరేట్లకు చూపించాలని కలెక్టర్ టి.చిరంజీవులు సూచించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమగ్ర సర్వే ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మండలంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి... ఎంత మంది ఎన్యుమరేటర్లను నియమించారని అడిగి తెలుసుకున్నారు. అలాగే సర్వేకు ఉపయోగించే మెటీరియల్ పంపిణీపై పలు సూచనలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. 30 కుటుంబాలకు ఒక్కో ఎన్యుమరేటర్ సర్వే నిర్వహిస్తారన్నారు. సర్వే సమయంలో ఇంట్లోఉన్న వారి పేర్లను మాత్రమే నమోదు చేసుకుంటారన్నారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల వివరాలు గానీ, ఆస్పత్రిలో ఉన్న వారి వివరాలను గానీ ఆయా అధికారులతో ధ్రువీకరణ పత్రం తీసుకొని వచ్చినప్పుడు నమోదు చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.విజయలక్ష్మి, డీటీ రంగారెడ్డి, ఆర్‌ఐ శశిధర్, సీనియర్ అసిస్టెంట్ జానీ షరీఫ్, పలువురు వీఆర్వోలు పాల్గొన్నారు.