పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించడంతో.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బంద్ పేరు చెప్పి ముందుగానే సిటీబస్సులను డిపోల లోంచి బయటకు తీయలేదు. దాంతో కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ప్రతిరోజూ సిటీబస్సులో వెళ్లేవాళ్లలో కొంతమందికి ద్విచక్ర వాహనాలున్నా.. వాటిలో ఇంధనం సరిపడ ఉందో, లేదో తెలియని పరిస్థితి. పోనీ రోడ్డుమీదకు వెళ్లి ఏదైనా బంకులో పెట్రోలు పోయించుకుందామంటే, నగరం మొత్తమ్మీద ఒకటి, అరా తప్ప పెట్రోలు బంకులు కూడా తెరిచిన పాపాన పోలేదు. ధైర్యం చేసి రోడ్డుమీదకు వెళ్దామంటే, నడిరోడ్డు మీద బండి ఆగిపోతే పరిస్థితి ఏంటోనని ఆందోళన. ఇదే పరిస్థితి సాయంత్రం వరకు కొనసాగింది.
ఇక సొంత వాహనాలు లేకుండా కేవలం సిటీబస్సుల మీదే ఆధారపడినవాళ్ల కష్టాలు ఇక చెప్పనలవి కావు. సిటీబస్సులు లేని సమయం చూసి ఆటోవాలాలు విజృంభించారు. సాధారణంగా షేర్ ఆటోకు పది రూపాయలు తీసుకునే చోట కూడా 25 నుంచి 40 రూపాయల వరకు డిమాండ్ చేసి, ముక్కు పిండి మరీ వసూలు చేశారు. రోడ్డు మీద ఏ ఆటో చూసినా కనీసం ఏడెనిమిది మందికి తక్కువ కాకుండా ఎక్కించుకుని వెళ్తున్నా, ట్రాఫిక్ పోలీసులు కూడా పట్టించుకోలేదు. కొన్ని రూట్లలో సెట్విన్ బస్సులు మాత్రం తిరిగాయి. అవి కూడా అతి తక్కువ సంఖ్యలోనే కనిపించాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది, నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి.. ఇక తెలంగాణ బంద్లు ఉండబోవని ఆశించిన సామాన్య ప్రజలకు గురువారం చుక్కెదురైంది. రోడ్డుమీద ఏ వాహనం వెళ్తున్నా కూడా బొటనవేలు పైకి చూపించి లిఫ్ట్ అడిగేవాళ్ల సంఖ్యకు లెక్కలేదు. ఇక ఏ బస్టాపులో చూసినా ఆటోలు తప్ప మరో వాహనం కనిపించలేదు. ఇలా బంద్ పేరు చెప్పి హైదరాబాద్ నగరవాసులకు మాత్రం ఆఫీసులకు వెళ్లేసరికి దేవుడు కనిపించాడు!!
బంద్తో చెప్పలేనన్ని ఇబ్బందులు
Published Thu, May 29 2014 3:58 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement