
మారథాన్... కేబినెట్ భేటీ
ఏడు గంటల సుదీర్ఘ చర్చ
ఒకవైపు కేబినె ట్ ఆమోదం.. వెనువెంటనే జీవో జారీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన రికార్డును తానే అధిగమించారు. కొంతకాలం కిందట ఆరున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీని ఏకంగా ఏడు గంటలపాటు (మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు) నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ఉన్నతాధికారులు సైతం ఒకటికి రెండు సార్లు తమ కార్యాలయాలకు, కేబినెట్ సమావేశానికి తిరగడం కనిపించింది.
ప్రభుత్వ సలహాదారు రమణాచారి రెండు మూడుసార్లు తిరిగగా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె. జోషీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు ఫైళ్లతో తమ పిలుపు కోసం సుమారు గంటన్నర వరకూ ఎదురు చూశారు. కేబినెట్ ఆమోదం పొందిన భూముల క్రమబద్దీకరణ అంశానికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. 17 పాయింట్ల ఎజెండా, మూడు టేబుల్ ఐటెమ్స్‌తో సమావేశం జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణం, ఛాతీ ఆసుపత్రి తరలింపు, భూముల క్రమబద్ధీకరణ, రియింబర్స్‌మెంట్, దేవుళ్లకు మొక్కులు, మాంసం, చేపల మార్కెట్ల ఆధునీకరణ వంటి అంశాలపై తీసుకున్న నిర్ణయాలనే బయటకు ప్రకటించారు.
వ్యతిరేక వార్తలపై పరువునష్టం దావా!
విపక్షాలకు ఆయుధంగా మారుతున్న ‘ఇసుక’ మాఫియా వ్యవహారం కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా ఓ పత్రికపై (సాక్షి కాదు) పరువు నష్టం దావా వేయాలని ఓ ఇద్దరు మంత్రులకు సీఎం సూచించినట్లు తెలిసింది. అలాగే ఇటీవల ఉద్వాసనకు గురైన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య వ్యవహారం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ‘ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించను. ఇక ఎవరి ఇష్టమున్న రీతిలో వారు మాట్లాడొద్దు’ అని సీఎం మంత్రులతో పేర్కొన్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి సవివ రంగానే చర్చించినట్లు తెలిసింది. గత ప్రభుత్వాలు ఈ స్కీమ్‌లో అవినీతికి పాల్పడ్డాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్తలనైనా ఉపేక్షించదన్న సంకేతం కిందికి వెళ్లాలని సీఎం సూచించారు. కేబినెట్ సమావేశంలో సాయంత్రం 7 వరకే 20 అంశాలకు సంబంధించి ర్యాటిఫికేషన్లు పూర్తి చేశారని, సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల దాకా పూర్తిగా రాజకీయపరమైన అంశాలపైనే చర్చ జరిగిందని తెలిసింది.
విద్యార్థుల పీజు రీయింబర్స్‌మెంట్‌పైనా చాలా సేపు చర్చ జరిగిందని, ముందు అనుకున్నట్లుగా ‘ఫాస్ట్’ పథకాన్నే కొనసాగించాలని మొన్నటి దాకా విద్యా మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి సూచించగా, ఈ విధానంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ముప్పు ఉన్నందువల్ల పాత విధానాన్నే కొనసాగించాలంటూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. దీంతో కడియం వైపే సీఎం మొగ్గు చూపారు.
డెరైక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్సులో ఉద్యోగాల వివాదాల పరిష్కారం కోసం జేడీ పోస్టును ఆమోదించారు. వైద్య, ఆరోగ్య శాఖలో పారా మెడికల్ రూల్స్‌కూ సవరణలు తీసుకు వచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ర్యాటిఫికేషన్ , మార్కెటింగ్ శాఖ నిబంధనల మార్పులపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.