ఏపీకి అన్నివిధాలా సహకరిస్తాం
* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాన్‌తో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవడానికి పూర్తి సహాయం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌కు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటన నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ముందు కేసీఆర్ సీఎస్‌తో మాట్లాడారు.
ఈ మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో మాట్లాడి కేసీఆర్ హామీని వివరించారు. కాగా.. ఢిల్లీ నుంచి ఆదివారం రాత్రి తిరిగి రాగానే హుదూద్ తుపాను పరిస్థితిపై ఉత్తర తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో ఆదివారం రాత్రి కేసీఆర్ సమీక్షించారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలపైన తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. తుపాను ప్రభావం ఉన్నన్ని రోజులు జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో మెలగాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.