ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రులు నాయిని, మహమూద్ అలీ, హరీశ్‌రావు, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ 3వ అంతస్తులో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసన మండలి ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, సమాచారహక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఉందా అనే అనుమానం ఉండేదన్నారు.
తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని సమైక్యరాష్ట్ర పాలకులు ఎద్దేవా చేశారని, అన్ని అవరోధాల ను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కమిషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 2003లోనే కమిషన్ ఏర్పాటైనా ఎక్కడా పనిచేయలేదన్నారు. గతంలో సమైక్యపాలకులకు మాత్రమే కమిషన్‌లో అవకాశం ఇచ్చారని, తెలంగాణ దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. కమిషన్ ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటామన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment