తెలంగాణ రాష్ట్రంలో భూ పంపిణీ కార్యక్రమం ఒక బూటకంగా మారిందని, మాయమాటలతో దళితులను మభ్యపెడుతున్నారని కుల వివక్ష
మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో భూ పంపిణీ కార్యక్రమం ఒక బూటకంగా మారిందని, మాయమాటలతో దళితులను మభ్యపెడుతున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండుమడుగు నర్సింహ, జాన్‌వెస్లీ అన్నారు. మంగళవారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్‌హాల్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీఎం పదవి దళితుడికి ఇస్తానన్న కేసీఆర్.. ఆయనే సీఎం సీటులో కూర్చున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేస్తానని మేనిఫెస్టోలో పొందుపరిచి ఆ డబ్బులను ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు.
దళితులకు మూడు ఎకరాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయాధికారిత దళితులకు మాత్రమే మూడు ఎకరాలు పంపిణీ చేస్తామని మెలికపెట్టడం శోచనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారానే భూమిని కొనుగోలు చేసి దళితులకు ఇస్తామనడం సరైంది కాదన్నారు. కేం ద్రంలోని మోదీ ప్రభుత్వం మతోన్మాదాన్ని సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. సమావేశంలో డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరశురాములు, టి.స్కైలాబ్‌బాబు, కొడిరెక్క మల్లయ్య తదితరులున్నారు.