‘అక్కడ మోదీ.. ఇక్కడ చిన్న మోదీ’
Published Sat, Mar 4 2017 7:26 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
మిర్యాలగూడ: ప్రధానమంత్రి మోదీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కేసీఆర్ వత్తాసు పలుకుతూ చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. సీపీఎం మహాజన పాదయాత్ర శనివారం నల్లగొండ జిల్లా వేములపల్లి, సూర్యపేటలోని మిర్యాలగూడ పట్టణాల్లో సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో తమ్మినేని మాట్లాడారు. కార్పొరేట్ మత శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊతం ఇస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తలకే వెల కట్టిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖున్ని అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లితే సీఎం కేసీఆర్ కేంద్రానికి మద్దతు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందుదొందే అని తమ్మినేని అన్నారు.
యేడాదికి కోటి ఉద్యోగులు నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు బ్యాంకుల్లో జమ చేస్తానన్న మోదీ వాటిని పక్కదారి పట్టించేందుకు మతోన్మాద శక్తులను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. అదే తరహాలో కేసీఆర్ కూడా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇతర పార్టీలపై బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ముందు ముక్కు నేలకు రాయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దద్దమ్మ పాలన సాగుతోందని దీనిని తెలియచెప్పి ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లో ‘పొలికేక’ పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తమ్మినేని చెప్పారు.
Advertisement