సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూసేకరణ చట్టానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టం ముసాయిదాను రూపొందించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర భూసేకరణ చట్టానికి లోబడి రాష్ట్ర భూసేకరణ చట్టంపై అధ్యయనానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలోని సబ్‌కమిటీ ఇచ్చిన నివేదిక ముసాయిదాను విడుదల చేసింది. ఈ భూసేకరణ చట్టం ముసాయిదాలో అభ్యంతరాలను, సూచనలను గెజిట్ ప్రచురించిన 15 రోజుల్లోగా తెలుపవచ్చునని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర భూసేకరణ చట్టంలోని అంశాలకు లోబడి రాష్ట్ర భూసేకరణ చట్టంలో పలు అంశాలను పొందుపర్చారు. భూసేకరణతో సామాజిక ప్రభావం, ప్రభావం అధ్యయనం చేయడానికి స్థానిక కమిటీ ఏర్పాటుచేయాలి. పునరావాసం, నష్ట పరిహారం వంటివాటికి గరిష్ట పరిమితులన్నీ కేంద్ర భూసేకరణచట్టం ప్రకారమే ఉంటాయని ఆ ముసాయిదాలో పేర్కొన్నారు.