సాక్షి, మెదక్: జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ గురువారం ప్రభుత్వాన్ని, అసెంబ్లీని రద్దు చేస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే ముందస్తు ఎన్నికలు ఖాయం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా వారి వ్యూహాలకు పదును పెడుతూ ముందస్తుకు సిద్ధం అవతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వెడెక్కిపోయింది. ముందస్తు ఎన్నికలు వస్తాయని తెలుస్తుండటంతో అన్ని పార్టీల్లోనూ సందడి నెలకొంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి తాము చేపట్టిన అభివృద్ది పనులు చెప్పుకునేందుకుగాను సమావేశాలు, గ్రామాల్లో పర్యటించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం రద్దు నేపథ్యంలో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతున్నారు.
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రెండు రోజులుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వేగంగా పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలంటూ ఇంజినీరింగ్ అధికారులపై వత్తిడి తీసుకువస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జన సమితిలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ప్రజల్లోకి అధికార ఎమ్మెల్యేలు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు గ్రామాల వారీగా ఇప్పటికే పర్యటన చేపట్టేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం నియోజవకర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. గురువారం మెదక్ పట్టణంలో రెండువేల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలతో సమావేశం నిర్వహించనున్నారు. 10వ తేదీ తర్వాత మెదక్‌లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 15వతేదీ నుంచి గ్రామాల వారీగా పర్యటనలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జిల్లాలో పర్యటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరున మెదక్ కు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్, నర్సాపూర్, మెదక్‌లో సీఎం కేసీఆర్ సభలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
సర్వే గుబులు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కార్యచరణను మాజీ మంత్రి సునీతారెడ్డి ఖరారు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను సైతం త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఆశావహుల్లో సర్వే గుబులు నెలకొంది. నర్సాపూర్ టికెట్ మాజీ మంత్రి సునీతారెడ్డికి ఖాయం. అయితే మెదక్ టికెట్ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మె ల్యే శశిధర్‌రెడ్డి, బట్టి జగపతి, తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, మామిళ్ల ఆంజనేయులు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఏఐసీసీ , పీసీసీ వేర్వేరుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. మెదక్ నియోజకవర్గంలో మూడు రోజులుగా సర్వే జరుగుతోంది. ఈ సర్వే తమకు అనుకూలిస్తుందో లేదోనని ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment