సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడంతో పార్టీ యంత్రాంగానికి వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో శుక్రవారం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కూడిన మహాకూటమి పొత్తుపై విమర్శలు గుప్పిస్తూ, చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో కూటమి పార్టీల్లోని అనైక్యతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పశ్చిమ ఆదిలాబాద్ ప్రాంతంలో కేసీఆర్ సభలు విజయవంతమైన నేపథ్యంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా అధినేత నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
నిర్మల్ సభతో ఐకే రెడ్డిలో రెట్టించిన ఉత్సాహం
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ సభలో ఐకే రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. నిర్మల్ జిల్లా ఐకే రెడ్డి వల్లనే సాధ్యమైందని, విజయవంతమైన మంత్రిగా నాలుగేళ్లకు పైగా పనిచేశారని ప్రశంసించారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తే ఐకే రెడ్డి విజయం ఖాయమని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఐకే రెడ్డికి కేసీఆర్ సభతో రెట్టించిన ఉత్సాహం వచ్చినట్లయింది. శుక్రవారం ఆయన నిర్మల్ రూరల్ మండలంలో పాదయాత్ర, ప్రచారం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, నాలుగేళ్లలో పూర్తిగాని పనులన్నింటినీ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే చేపడతానని హామీ ఇచ్చారు. మరోవైపు ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజా ఆశీర్వాద సభ ఇచ్చిన ఉత్సాహంతో మండలాలు, పట్టణంలో ప్రచారంలో పాల్గొనడం గమనార్హం.
ఆదిలాబాద్‌లో సైతం కేసీఆర్ సభ ఎఫెక్ట్
పశ్చిమ జిల్లా పర్యటనలో భాగంగా నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ నియోజకరవ్గంలో కేసీఆర్ సభ జరకపోయినప్పటికీ, ఇచ్చోడ సభ ఎఫెక్ట్ ఇక్కడివరకు పాకింది. మంత్రి జోగు రామన్న స్వయంగా ఇచ్చోడ వెళ్లి ముఖ్యమంత్రిని కలవగా, ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున జనం ఇచ్చోడ సభకు తరలివచ్చారు. ఆదివాసీల సమస్య, అటవీ భూముల్లో పోడు వ్యవసాయం, గిరిజన, గిరిజనేతర భూ వివాదాలపై కేసీఆర్ చేసిన ప్రసంగం ఈ నియోజకవర్గానికి కూడా ఉపయోగపడేదే. నిర్మల్‌లో జరిగిన సభలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన కృషిని ప్రశంసించడం గమనార్హం. మలి విడత ప్రచారంలో పార్టీ అధినేత కేసీఆర్ మంచిర్యాల, కుమురంభీం, జిల్లాతో పాటు ఆదిలాబాద్‌లో కూడా ప్రచారం నిర్వహిస్తారని మంత్రి రామన్న వర్గీయులు చెపుతున్నారు.
గట్టిపోటీ ఉన్న స్థానాల్లో విజయవంతంగా కేసీఆర్ సభలు
పశ్చిమ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ సభలు అభ్యర్థులకు జీవం పోశాయి. కూటమి అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఖానాపూర్, ముథోల్, బోథ్ (ఇచ్చోడ)లలో నిర్వహించిన సభలకు భారీగా జనసమీకరణ జరిపారు. బోథ్‌లో సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న అభ్యర్థి రాథోడ్ బాపూరావు ఈ సభ ద్వారా ఊరట పొందారనే చెప్పవచ్చు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తొలిసారిగా బాపూరావుతో పాటు సభా వేదికను పంచుకోవడమే గాక, అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. నగేష్ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్టు కోసం పోటీపడి నిరాశతో ఇప్పటి వరకు ప్రచారానికి దూరంగా ఉండగా, సీఎం చొరవతో బాపూరావుకు సహకారం అందిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
చిన్న చిన్న విభేదాలను పక్కనబెట్టి అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని కేసీఆర్ చేసిన సూచన కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఖానాపూర్‌లో పార్టీ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్ నేతృత్వంలో జరిగిన సభ అనూహ్యరీతిలో విజయవంతమైంది. ఇక్కడ ప్రత్యర్థి రమేష్ రాథోడ్ నుంచి రేఖానాయక్ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సభ విజయవంతం కావడంతో రేఖానాయక్‌లో విజయంపై విశ్వాసం పెరిగింది. ముథోల్ అభ్యర్థి జి.విఠల్‌రెడ్డి నేతృత్వంలో భైంసా సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. అభ్యర్థి సైతం ఇంత భారీ ఎత్తున సభ విజయవంతం అవుతుందని ఊహించలేదని పార్టీ నాయకులు చెపుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న విఠల్‌రెడ్డి ఈ సభతో ఊరట పొందారనే చెప్పవచ్చు.
తూర్పున ఊపు తెచ్చిన కేసీఆర్ సభలు
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల ప్రభావం మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలను తాకింది. మంచిర్యాలలో పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు రెట్టించిన ఉత్సాహంతో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో తనకు మద్ధతు పలికిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో సింగరేణి ఏరియా, మంచిర్యాల పట్టణాల్లో తన ఓటుబ్యాంకును పెంచుకునే ప్రయత్నం ప్రారంభించారు. అసంతృప్తితో ఉన్న పట్టణ కౌన్సిలర్లను తిరిగి తన దరికి చేర్చుకోవడంలో సఫలమవుతున్నారు. బెల్లంపల్లిలో పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య మండలాలు, గ్రామాల ప్రజలను నమ్ముకొని ముందుకు సాగుతున్నారు.
ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా వినోద్ రావడంతో కొంత ఇబ్బంది పడ్డ చిన్నయ్యకు ఆదిలాబాద్‌లో కేసీఆర్ పర్యటనతో ఉత్సాహం వచ్చింది. త్వరలోనే బెల్లంపల్లికి కేసీఆర్‌ను తీసుకొస్తానని పార్టీ యంత్రాంగానికి చెపుతున్నారు. పట్టణంలో తనను కాదన్న కౌన్సిలర్ల స్థానంలో వారి వ్యతిరేకులను పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి వ్యూహరచన చేస్తున్నారు. ఆసిఫాబాద్, సిర్పూరు, చెన్నూరులలో పార్టీ అభ్యర్థులు సీఎం రాక కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment