సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన 19 నెలల తరువాత సరిహద్దుల్లోని చెక్‌పోస్టులలో తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ సరిహద్దుల్లోని ఏడు ప్రాంతాలను చెక్‌పోస్టులుగా గుర్తించినా, ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేవు. అక్రమ సరకు రాష్ట్రానికి యథేచ్ఛగా వచ్చి పడుతోంది. చెక్‌పోస్టులు సవ్యంగాలేని కారణంగా ప్రతి నెలా కనీసం రూ.300 కోట్ల విలువైన జీరో దందా సాగుతున్న వైనంపై ఇటీవలే ‘సాక్షి’ దినపత్రిక ‘జోరుగా జీరో దందా’ శీర్షికన వార్తాకథనాన్ని ప్రచురించింది.
ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల కమిషనర్ అనిల్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తూ సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు లేని కారణంగానే అక్రమ దందా సాగుతుందని పేర్కొన్నట్లు సమాచారం. వచ్చే బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయిస్తే చెక్‌పోస్టులను నిర్మిస్తామని వివరించారు. తాత్కాలికంగా చెక్‌పోస్టుల్లో వసతుల ఏర్పాట్ల కోసం రూ. 9.03 కోట్లు కేటాయించాలని కోరారు. మంత్రి తలసాని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వచ్చే బడ్జెట్‌లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటు కోసం రూ. 150 కోట్లు మంజూరు చేసేందుకు కూడా కేసీఆర్ అంగీకరించినట్లు ఓ అధికారి తెలిపారు.
ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులకు రూ.9 కోట్లు
Published Fri, Jan 8 2016 3:23 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement