- వీసీల నియామకాల్లో నిబంధనలు సడలింపు
- విద్యా శాఖ నిర్ణయం.. త్వరలో నోటిఫికేషన్ జారీ
- ఉస్మానియా సహా తొమ్మిది వర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లు
- వచ్చే నెలాఖరులోగా నియామకాలు పూర్తి చేసేందుకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్(వీసీ) పోస్టుల భర్తీలో నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పని చేసి ఉండాలన్న ప్రధానమైన నిబంధన ఉంది. అయితే రాష్ట్రంలో కొన్ని కేటగిరీల్లో వైస్ చాన్స్‌లర్ పోస్టుకు పదేళ్ల సీనియారిటీ కలిగిన ప్రొఫెసర్లు లేకపోవడంతో దీనిని ఐదేళ్లకు తగ్గించాలని నిర్ణయించింది. తద్వారా వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించవచ్చని భావిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
గతంలో వివిధ కోణాల్లో ఆలోచించినా..
వీసీల నియామకాలకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఏమైనా రిజర్వేషన్ కల్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలను ప్రభుత్వం గతంలో చేసింది. వీసీల నియామకాలకు సంబంధించిన అన్ని నిబంధనలను, మార్గదర్శకాలను పరిశీలించిన అధికారులు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదని తేల్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకే కాకుండా అన్ని కేటగిరీల వారికి ఐదేళ్ల సడలింపు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది.
ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసి త్వరలోనే నోటి ఫికేషన్‌ను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. గత వారమే నోటిఫికేషన్ జారీ చేయాలని భావించినా అప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నోటిఫికేషన్ జారీని నిలిపివేశారు. ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం లేఖ రాశారు. ఇందుకు ఈసీ కూడా ఇటీవల ఓకే చెప్పింది. దీంతో రెగ్యులర్ వైస్ ఛాన్స్‌లర్లు లేని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతోపాటు శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టిశ్రీరాములు తెలుగు, అంబేడ్కర్ ఓపెన్, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల నియామకాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఇక జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్ పోస్టు భర్తీ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్న నేపథ్యంలో ఆ వర్సిటీకి వీసీ నియామకంపై తర్వాత దృష్టి సారించాలన్న నిర్ణయానికి వచ్చింది. తొలుత తొమ్మిది వర్సిటీలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత సెర్చ్ కమిటీలు వచ్చిన దర ఖాస్తుల్లో అర్హతలను బట్టి ప్రాధాన్య క్రమంలో ప్రభుత్వానికి ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లను సూచించనున్నాయి. మొత్తంగా వచ్చే నెలాఖరులోగా వీసీల నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రొఫెసర్‌గా పదేళ్లు కాదు.. ఐదేళ్లు చాలు
Published Sat, Dec 12 2015 4:43 AM | Last Updated on Sat, Apr 6 2019 9:11 PM
Advertisement