సాక్షి, హైదరాబాద్: సాధారణంగా జూన్ వచ్చిందంటే బడిగంటలు మోగుతాయి.. అప్పటివరకు వేసవి సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలంతా మళ్లీ బండెడు పుస్తకాలు వీపున వేసుకుని బడిబాట పడతారు. కానీ జూలై వచ్చినా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు. కరోనా మహమ్మారి అంతా కకావికలం చేయడంతో పాఠశాల విద్యాబోధన ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే దాదాపు మూడున్నర నెలలుగా మూతపడ్డ విద్యాసంస్థలు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. 2019–20 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేసిన సర్కారు.. కొత్త విద్యా సంవత్సరం ఊసే ఎత్తడంలేదు.
ఈ నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందనే ప్రశ్న తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఈ ఏడాది విద్యా సంవత్సరం ఉంటుందా లేక జీరో ఇయర్ చేసేస్తారా అనే సందేహం వారిని పట్టిపీడిస్తోంది. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రస్తుతానికి ఆన్‌లైన్ పద్ధతిలో పాఠాలు బోధిస్తుండగా.. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో దాదాపు 59 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా.. 10,756 ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం నూతన విద్యా సంవత్సర వార్షిక ప్రణాళిక విడుదల చేస్తుంది. దీని ప్రకారమే పాఠ్యాంశ బోధన, పరీక్షల నిర్వహణ, సెలవులు ఉంటాయి. సాధారణంగా జూన్ 12 నాటికి ఈ ప్రణాళిక విడుదలవుతుంది. కానీ 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కేలండర్‌పై ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలూ మూతపడే ఉన్నాయి. ఆగస్టు 15లోపు పాఠశాలలు తెరిచే ప్రసక్తే లేదని ఇటీవల కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకటించారు. పోనీ ఆ తర్వాతైనా తెరుస్తారా లేదా అనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ప్రైవేటులో అలా.. సర్కారులో ఇలా..
కరోనా కారణంగా పాఠశాల విద్య గందరగోళంలో పడినా ప్రైవేటు పాఠశాలలు మాత్రం తమ దందా కొనసాగిస్తున్నాయి. ఆన్‌లైన్ బోధన అంటూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ముందుకు వెళుతూ ఫీజుల విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. గతనెల 10 నుంచే పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ బోధన మొదలుపెట్టి ఫీజులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఈసారి నెలవారీగా ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని, మరే రకమైన ఫీజులూ వసూలు చేయొద్దని సర్కారు ఆదేశించడంతో ట్యూషన్ ఫీజుల్లోనే అన్నీ కలిపేసి వాటిని భారీగా పెంచేశాయి. ఇక ఆన్‌లైన్ తరగతుల విషయంలో ప్రైవేటు పాఠశాలలు దూసుకెళ్తున్నా, సర్కారు స్కూళ్లలో మాత్రం అయోమయం నెలకొంది.
ఆన్‌లైన్ విద్యా బోధన ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదంటున్న అధికారులు.. ఎలా ముందుకు సాగాలనే విషయంలో మాత్రం ఎలాంటి ఆలోచన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాము అకడమిక్ వ్యవహారాలు మాత్రమే చూస్తామని, స్కూళ్ల ప్రారంభానికి సంబంధించిన అంశంపై పాఠశాల విద్యా డైరెక్టరేట్ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) చెబుతుండగా.. డైరెక్టరేట్‌లో దీనిపై కనీసం ఆలోచన చేసే అధికారులు కూడా లేకపోవడం గమనార్హం. విద్యాశాఖ కమిషనర్‌గా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉండటంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఆలోచించే అధికారి లేరు. దీంతో అంతా గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో టీసాట్ వంటి చానల్ ద్వారా లేదా ఇతర మాధ్యమాల్లో వీటిని నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది.
ఆన్‌లైన్‌ను పరిగణనలోకి తీసుకుంటారా?
ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పైగా ఇప్పటికీ అకడమిక్ కేలండర్ కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ బోధన అంతా పరిగణనలోకి వస్తుందా రాదా అనే సందేహం అటు ప్రైవేటు యాజమాన్యాల్లో కూడా ఉంది. పైగా ఫీజులు చెల్లించిన విద్యార్థులకే ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నారు. అయితే, వీరిలో కూడా అందరూ వీటికి హాజరు కావడంలేదు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండకపోవడంతో అందరూ ఆన్‌లైన్ తరగతులకు రాలేకపోతున్నారు.
పైగా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం తప్పడంలేదు. ఇద్దరికీ వేర్వేరుగా టాబ్ లేదా ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ ఉండాల్సిందేనని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులకు తిప్పలు తప్పడంలేదు. అసలే కరోనా కారణంగా లాక్‌డౌన్, సగం జీతాల వంటి పరిస్థితుల్లో స్కూల్ ఫీజులు కట్టడానికే డబ్బులు లేవని ఆందోళన చెందుతుంటే.. ఈ అదనపు భారం ఏమిటా అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బోధన అంతంతే...
వాస్తవానికి ఆన్‌లైన్ పాఠాల వల్ల విద్యార్థులకు పెద్దగా ఉపయోగంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో వారు శ్రద్ధగా పాఠాలు వినడంలేదని, ముఖ్యంగా ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి లోపు పిల్లలు ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ ముందు కూర్చోవడమేలేదని చెబుతున్నారు. పైగా రికార్డెడ్ వీడియో పాఠాలు పెద్దగా విద్యార్థులకు ఉపయోగపడటంలేదని పేర్కొంటున్నారు.
లైవ్ తరగతులు కొన్నింటిని నిర్వహించినా వాటిని సరిగా వినడమేలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు చెప్పేది అర్థంకాకపోవడం, సందేహాలను అప్పటికప్పుడు అడిగే పరిస్థితి లేకపోవడంతో వీటి వల్ల లాభం లేదని చెబుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్ తరగతుల వల్ల చిన్న పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్) ఇప్పటికే హెచ్చరించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం కేజీ నుంచి 5వ తరగతి వరకు ఆన్‌లైన్ పాఠాలను నిషేధించింది. రాష్ట్రంలో మాత్రం అలాంటి చర్యలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment