‘బచావత్’నూ తిరగదోడాలి!
► ఆ ట్రిబ్యునల్ తీర్పు నుంచే తెలంగాణకు అన్యాయం
► బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డులోనూ అదే తీరు
► తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం
► సమగ్ర సమీక్షతో నాలుగు రాష్ట్రాలకు కొత్తగా కేటాయింపులు జరగాలి
► 24న కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు సిద్ధమైన కేసీఆర్ సర్కారు
► ట్రిబ్యునల్ స్పందనతో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన
సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం మొత్తాన్ని తిరగదోడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డును ఇప్పటికే వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కారు.. అంతకుముందున్న బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునూ పూర్తిగా సమీక్షించాలని భావిస్తోంది. ఈ రెండు ట్రిబ్యునళ్ల అవార్డుల వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయమే జరిగిందని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. రాష్ర్ట విభజన నేపథ్యంలో... ఉమ్మడి రాష్ట్రానికి ఉద్దేశించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాని గడువును పెంచింది. ఈ మేరకు పునర్విభజన చట్టంలోనే పొందుపరిచారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల పంపిణీపై ఈనెల 24న బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట తొలిసారిగా వాదనలు జరగనున్నాయి. ఈ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మిగులు జలాల పంపిణీతో తమకు అన్యాయం జరుగుతోందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల కూడా తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఈ విషయాన్ని కూడా సమీక్షించాలంటూ గట్టి వాదనలు వినిపించాలని కేసీఆర్ సర్కారు తాజాగా నిర్ణయించింది. ‘మొదటి(బచావత్) ట్రిబ్యునల్ ముందు వాదనల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం కోణంలో ఏమీ ఆలోచించలేదు. అప్పుడే చాలా అన్యాయం జరిగింది. తొలి ట్రిబ్యునల్ కేటాయింపుల స్ఫూర్తిని అలాగే పాటిస్తూ మిగులు జలాలను పంపిణీ చేసిన రెండో(బ్రిజేశ్‌కుమార్) ట్రిబ్యునల్ అవార్డుతోనూ తెలంగాణ ప్రాంతానికి నష్టమే జరిగింది. అప్పుడు తెలంగాణ ప్రాంతం తరఫున వాదించే దిక్కులేదు. ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రభుత్వం ఉంది.
అందుకే నీటి కేటాయింపులను సమూలంగా సమీక్షించాలనేది ఈ ప్రభుత్వ డిమాండ్’ అని సాగునీటి శాఖ ముఖ్యుడొకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఇది జరగాలంటే ఈ ట్రిబ్యునల్ ప్రస్తుత విచారణ పరిధిని కేవలం తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయకుండా కర్ణాటక, మహారాష్ట్రలను కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు నియమ నిబంధనలూ సవరించాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంటు ఆమోదించిన పునర్విభజన చట్టానికే సవరణలు అవసర మా? లేక కేంద్రమే ఈ నిర్ణయాన్ని తీసుకుంటే సరిపోతుందా?.. అలాగే దీనికి సుప్రీంకోర్టు ఆమోదం తప్పనిసరా? వంటి అంశాలపై న్యాయనిపుణులతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
అంగీకరించకపోతే ఎలా?
నాలుగు రాష్ట్రాల కేటాయింపులను మొదటి నుంచీ సమీక్షించాలనే డిమాండ్‌ను బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అంగీకరించడం ప్రశ్నార్థకమే! రాష్ట్ర డిమాండ్‌ను ఒకవేళ ట్రిబ్యునల్ తిరస్కరించే పక్షంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కేంద్రం ముందుపెట్టాలని, లేదంటే సుప్రీంను ఆశ్రయించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం.. ఒక రాష్ట్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును కోరితే.. కేంద్రం అందుకు అంగీకరించాల్సి ఉంటుందని, దాని ఆధారంగానే కేటాయింపులను తిరగదోడాలని రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు సంబంధించి నేడో రేపో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నత స్థాయిలో సమీక్ష జరపనున్నారు.
ప్రాతిపదికలనే ప్రశ్నిద్దాం!
రెండు ట్రిబ్యునళ్లు కూడా మొత్తం నీటి లభ్యత, ప్రస్తుత ప్రాజెక్టుల అవసరాలు, రాష్ట్రాల డిమాండ్లనే తప్ప... ఆయా రాష్ట్రాల్లోని వాస్తవ నదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణం, ప్రాంతాలవారీగా సమకూరుతున్న జల పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకోలేదన్నది రాష్ర్ట ప్రభుత్వ ఆరోపణ. దీనికి తగిన గణాంకాలనూ సేకరించింది. అలాగే ప్రాంతాల వెనకబాటుతనం, పేదరికం, తాగునీటి అవసరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని వాదించనుంది. ‘తుంగభద్ర నుంచి మహబూబ్‌నగర్‌కే 19 టీఎంసీలు రావల్సి ఉండేది. భీమాకు 100 టీఎంసీలు ఇవ్వాల్సి ఉండేది. బచావత్ ట్రిబ్యునల్ గనుక ఇవి పరిగణనలోకి తీసుకుని ఉంటే గురుత్వ కాలువల ద్వారానే బోలెడు నీరు వచ్చి ఉండేది. అలాగే రాజోలిబండ డైవర్షన్ కెనాల్‌కు 5 టీఎంసీలు ఎలా ఇచ్చారు? బేసిన్ బయట ఉన్న తెలుగు గంగకు 25 టీఎంసీలు ఎలా ఇచ్చారు? ఇలా రెండు ట్రిబ్యునళ్ల ఎదుట కూడా కేవలం సీమాంధ్ర కోణంలో మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించిందే తప్ప తెలంగాణ గురించి అస్సలు ఆలోచించలేదు. అందుకే సమూల, సమగ్ర సమీక్ష జరిపి పునఃకేటాయింపులు చేయాలని అడుగుతున్నాం’’ అని సాగునీటి శాఖ అధికారి వ్యాఖ్యానించారు.
24న కృష్ణా ట్రిబ్యునల్ భేటీ
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తలెత్తిన జల వివాదాల నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల వాదనలు వినడానికి బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ తొలిసారి ఈనెల 24న సమావేశం కానుంది. దీంతో ఏపీ పక్షాన వాదించడానికి సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీని ప్రభుత్వం నియమించినట్లు తెలిసింది. అరుుతే ట్రిబ్యునల్ ముందు ఏ విధమైన వాదనలు విన్పించాలనే అంశంపై రాష్ర్టం ఇంకా ఓ తుది నిర్ణయూనికి రాలేదు.