హైదరాబాద్: తెలంగాణ ప్రజలపై విద్యుత్తు చార్జీల పిడుగుపడింది. ఈ మేరకు విద్యుత్ చార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చార్జీల బాదుడు షురూ అయింది. అధికారులు బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమై విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వివరించారు. అధికారుల ఇచ్చిన వివరాలతో కేసీఆర్ సంతృప్తి చెందడంతో ప్రభుత్వం నుంచి ఈఆర్ సీకి చార్జీల ఫైల్ చేరింది. దీంతో రాష్ట్రంలోని ప్రజల మీద రూ.1,736 కోట్ల భారం పడనుంది.
చార్జీల వివరాలివీ..
100 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగదారులపై ఎటువంటి పెంపు లేకుండా చేసిన ప్రభుత్వం, 100 యూనిట్లకు పైగా వాడే వారిపై ఏకంగా 7.5 శాతం చార్జీలను పెంచింది. కాగా, పెరిగిన చార్జీలు జులై 1 నుంచి అమలు రానున్నాయి.100-200 యూనిట్ల మధ్య కరెంటును వినియోగించేవారికి యూనిట్ కు రూ.3.60 నుంచి రూ.4.30 లకు, 200-300 యూనిట్ల మధ్య కరెంటును వినియోగించేవారికి యూనిట్ కు రూ.6.80 నుంచి రూ.7.20లకు, 300-400 యూనిట్ల మధ్య కరెంటును వినియోగించేవారికి యూనిట్ కు రూ.7.80 నుంచి రూ.8.50లకు, 400-800 యూనిట్ల మధ్య కరెంటును వినియోగించేవారికి యూనిట్ కు రూ.8.50 నుంచి రూ.9.00 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.చక్కెర పరిశ్రమలకు యూనిట్ కు రూ.4.90ల నుంచి రూ.5.20లకు, కోళ్ల పరిశ్రమలకు యూనిట్ కు రూ.3.60 నుంచి రూ.4.00లకు మిగిలిన అన్నిరకాల పరిశ్రమలకు యూనిట్ కు రూ. 6.40 నుంచి రూ.6.70 లకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.