పల్లెల్లో పచ్చదనం సంతరించుకోనుంది. తరిగిపోతున్న అడవుల శాతాన్ని తిరిగి పెంచడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు పడగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సాక్షి, జనగామ: పల్లెకు పచ్చదనం పర్చుకోనుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు తగిన కార్యా చరణను అధికారులు రూపొందిస్తున్నారు. తరిగి పోతున్న అడవుల శాతాన్ని తిరిగి పొందడంతో పా టు వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విధితమే. వర్షాలు పడగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు.
ఐదో విడత లక్ష్యం 1.80కోట్లు..
జిల్లాలో ఐదో విడత హరితహారంలో భాగంగా 1.80కోట్ల మొక్కలను నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ(ఎన్‌ఆర్‌ఈజీఎస్), తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా మొక్కలను పెంచుతున్నారు. ఉపాధి హామీపథకంలో భాగంగా 1,24,50,000 మొక్కలను 252 నర్సరీలో పెంచుతున్నారు. గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గతంలో మండల కేంద్రాల్లో మొక్కలను పెంచితే రవాణా చేయడం కష్టంగా మారేది. ఇప్పుడు అలా కాకుండా గ్రామాల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు.
పంచాయతీలకు బాధ్యత..
గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామపాలక వర్గాలకు బాధ్యత అప్పగించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారంగా మొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా పొందుపర్చారు. ప్రతి గ్రామం పచ్చదనంతో ఉండే విధంగా సర్పంచ్‌లు, పాలకవర్గం బాధ్యత తీసుకోవాలని ప్రత్యేకంగా చూసించారు. ఉపాధిహామీ సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, వార్డు సభ్యులను భాగస్వామ్యం చేస్తోంది.
జూలై మొదటివారంలో ప్రారంభం..
రానున్న జూలై నెల మొదటివారంలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. జులైలో వర్షాకాల సీజన్ కావడంతో నాటిన మొక్కలను కాపాడే వీలుంటుంది. ప్రభుత్వం ప్రారంభించే తేదీని బట్టీ జిల్లాలో లాంఛనంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైతుల వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు రోడ్డు పక్కన మొక్కలు నాటేందుకు ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
అటవీశాఖ లక్ష్యం 56 లక్షలు..
అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 56లక్షల మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ రేంజ్ పరిధిలో 56 లక్షలను పెంచడానికి అధికారులు మొక్కలను పెంచుతున్నారు.
56 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అటవీశాఖ వేరుగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జూలై మొదటివారంలో నాటుతాం
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీలో భాగంగా మొక్కలను పెంచుతున్నారు. గ్రామానికి 40వేల మొక్కలను పంపిణీ చేస్తాం. వర్షాలను బట్టి మొక్కల పంపిణీ ప్రారంభం అవుతుంది. నర్సరీల్లో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా మొక్కలను పెంచుతున్నాం. జూలై మొదటివారంలో జిల్లా అంతటా మొక్కలను నాటే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి హరితహారాన్ని ప్రారంభిస్తాం. –రాంరెడ్డి, డీఆర్‌డీఓ
పల్లెల్లో హరితశోభ
Comments
Please login to add a commentAdd a comment