సాక్షి, హైదరాబాద్: ‘మొక్క’వోని దీక్షతో మరోసారి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20.8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు, హరితహారం కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది.
కోటి చింత మొక్కలు.. మియావాకీ వనాలు
హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి చింత మొక్కలను నాటనున్నారు. అటవీ ప్రాంతాల్లో ఫల వృక్షాలు గణనీయంగా తగ్గిపోవడంతో జనావాస ప్రాంతాలకు వస్తున్న కోతుల బెడదను అరికట్టడానికి సాధ్యమైనంతవరకు పండ్ల మొక్కలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా కోటి చింత మొక్కలకు ప్రాణం పోసేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. గ్రామ పంచాయతీలు, అటవీ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ ప్రదేశాల్లో వీటిని విరివిగా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చింతపండుకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నందున ఈ మొక్కల పెంపకానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపించే మియావాకీ వనాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఒకే చోట గుబురుగా పెరిగే ఈ వనాలతో ఆ ప్రదేశం ఆకుపచ్చగా కనిపించడమేగాకుండా.. పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడవచ్చని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 4వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, స్థానిక ప్రజలు తమ ఇంటి పెరట్లో పెంచుకునేందుకు వీలుగా మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగా స్థానిక నర్సరీల్లోని మొక్కలను ఇప్పటికే సిద్ధం చేశారు. వ్యవసాయ అటవీ విస్తరణలో భాగంగా వెదురు మొక్కలను బాగా నాటాలని, అప్రోచ్ రోడ్లు, ప్రధాన రోడ్ల కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ను చేపట్టాలని నిర్ణయించింది. జీవాలనుంచి మొక్కలను కాపాడేందుకు ఫైబర్ ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కాగా, పంచాయతీలు, పురపాలికల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. అలాగే ప్రతి శుక్రవారం మొక్కలకు నీరుపోసేలా వాటరింగ్ డేను పాటించాలని నిర్ణయించింది.
20 కోట్ల మొక్కలు లక్ష్యంగా..
Published Wed, Jun 17 2020 2:27 AM | Last Updated on Wed, Jun 17 2020 2:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment