సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పలు జిల్లాల్లో గ్రామపంచాయతీల సిబ్బందికి రెండు నుంచి నాలుగు నెలల వేతనాలు రాకపోవడంతో మొక్కల సంరక్షణపై దృష్టి సారించడం లేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో నీటి వసతిలేదు. కొన్నిచోట్ల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. వీటికి వేసవి తోడు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి.
12,769 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు
ఏటా నిర్వహించే హరితహారంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పల్లెవాసులకు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచేందుకు పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటారు. అక్కడ సేద తీరేందుకు వీలుగా బెంచీలు కూడా ఏర్పాటుచేశారు. ఉపాధి హామీ పథకం కింద గత రెండేళ్లు వీటి నిర్వహణ బాగానే సాగింది. నర్సరీల పెంపకం, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటడం, నీటి వసతి, వన సేవకులకు వేతనం అంతా ఈ పథకం ద్వారా చెల్లించడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీ (జీపీ)లకు అప్పగించడంతో పరిస్థితి మారింది.
పలు జిల్లాల్లో పూర్తిగా ఎండిపోయి..
ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణ చూసుకునే బాధ్యత గ్రామపంచాయతీ వర్కర్లకు అప్పగించారు. అయితే వీరికి రెండు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వీరు బాధ్యతలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల వనాల్లో బోర్లు లేక కూడా మొక్కలు ఎండిపోయాయి. ఆయా ప్రాంతాల్లో పంచాయతీల ట్యాంకర్లతో నీళ్లు పట్టినా.. ట్యాంకర్ల నిర్వహణ జీపీలకు పెనుభారమైన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతివనాలు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి.
మోడువారిన లక్ష్మీపురం వనం
ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడెం జీపీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పల్లె ప్రకృతి వనం. 2020–21లో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద ఎకరం విస్తీర్ణంలో 913 మొక్కలు నాటారు. రెండేళ్లపాటు నిర్వహణ ఈజీఎస్ చూడటంతో వర్కర్లకు వేతనం అందింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామ పంచాయతీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత క్రమంగా మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇక్కడ నీరందించేందుకు బోరు వేసినా మోటారు బిగించలేదు.
అసలే ఎదగలేదు.. ఆపై నీరందక..
ఇది వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నెక్కొండ తండాలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం. ప్రస్తుతం విపరీతమైన ఎండలతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇక్కడ సారవంతమైన భూమికి బదులుగా చౌడు భూమిలో మొక్కలు నాటారు. దీంతో మొక్కలు మామూలుగానే సరిగా ఎదగలేదు. ప్రస్తుతం వేసవి తాపానికి తోడు తగిన నీరందకపోవడంతో ఎండిపోతున్నాయి.
మూడు నెలల డబ్బులు రావాలి..
ప్రకృతి వనంలో మొక్కలను కాపాడేందుకు ఎండనక, వాననక కష్టపడ్డా. నెలకు రూ.3 వేల చొప్పున మూడు నెలల వేతనం రాలేదు. అధికారులను అడిగితే వస్తుందనే సమాధానం తప్ప బ్యాంకులో జమ అయిందే లేదు. –పార్నంది గౌరమ్మ, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ జిల్లా
నెల నెలా ఎదురుచూపులే..
వన సేవకుడిగా పనిచేస్తున్నా. గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఈనెల వస్తాయంటూ ఎదురుచూస్తున్నా. చేసిన పనికి ప్రతినెలా డబ్బులిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. – బోసి ధర్మయ్య, బజార్ కొత్తూర్, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా
జీతాలు లేక.. పనికి రాక
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని అమ్రాద్ తండాలో నాలుగైదు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికులు పనికి రావడం మానేశారు. ఇక నీళ్ల ట్యాంకర్‌కు అవసరమైన డీజిల్ డబ్బు కూడా లేకపోవడంతో వనంలో మొక్కలకు నీరందక ఎండిపోతున్నాయి.
అన్నిచోట్లా వేతనాల సమస్యే..
♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 42 మండలాల్లో 1,070 జీపీలు ఉండగా, 3,851 మంది మల్టీ పర్పస్ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి సంబంధించి రూ.2 కోట్ల వరకు వేతనాలు అందాల్సి ఉంది. ఈ జిల్లాలో 2,088 వనాలు ఏర్పాటు చేయగా, చాలా చోట్ల బోర్లు వేయకపోవడం, ట్యాంకర్లపైనే ఆధారపడి నీళ్లు పోయాల్సి రావడంతో వేసవిలో మొక్కలు ఎండిపోతున్నాయి.
♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,509 జీపీలకు గాను 3,406 వనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న 4,924 మంది వర్కర్లకు 2 నుంచి 4 నెలల వరకు వేతనాలు రూ.10.11 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే రూ.6 కోట్ల వేతనాలు అందాలి. ఈ క్రమంలో వేసవిలో నీరు అందకపోవడంతో అధికారుల దృష్టికి వచ్చిన చోట ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసినా మిగతా చోట్ల వనాలు ఎండిపోయాయి.
♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,056 జీపీలకు గాను 1,338 వనాలు ఉన్నాయి. నిధులు లేక వారానికోసారి నీరు పడుతున్నారు. కొన్నిచోట్ల పూర్తిగా వదిలేశారు. ఐదారు నెలలుగా డబ్బు అందక పోవడంతో వన సేవలు పని మానేశారు.
♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 963 గ్రామ పంచాయతీలు ఉండగా 965 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. నీరు లేక ఇప్పటికే 92 వనాలు ఎండిపోయే స్థితికి చేరాయి. మొత్తం 3,998 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
♦ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల నుంచి, వనపర్తి, గద్వాల, నారాయణ్‌పేట జిల్లాల్లో 4 నెలల నుంచి వేతనాలు రావడం లేదు. మొత్తంగా 5,786 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు సంబంధించి సుమారు రూ.13 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 నెలలుగా 5,666 మంది వర్కర్లకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వారు ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment