సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) 3.144 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల మూల వేతనంపై కరువు భత్యం 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెరిగింది. 2018 జూలై 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.
డీఏ బకాయిల చెల్లింపు ఇలా...
2018 జూలై 1 నుంచి 2019 మే 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జీపీఏ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2019 సెప్టెంబర్ 30కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించనుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు, 2018 జూలై 1 నుంచి 2019 మే 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ (పీఆర్‌ఏఎన్) ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది. జీపీఎఫ్‌కు అనర్హులైన ఫుల్‌టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది.
3.144 శాతం పెంపు వీరికే...
2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి 3.114 శాతం డీఏ పెంపు వర్తించనుందని ప్రభుత్వం తెలిపింది.
యూజీసీ వేతనాలపై 6 శాతం డీఏ పెంపు
సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 142 శాతం నుంచి 148 శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్‌తోపాటు ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది.
- పద్మనాభన్ కమిటీ నివేదిక ఆధారంగా 2010లో జారీ చేసిన జీవో 73 మేరకు వేతన సవరణ పొందిన న్యాయాధికారుల కరువు భత్యాన్ని 142 శాతం నుంచి 148 శాతానికి ప్రభుత్వం పెంచింది.
- వేతన సవరణ–2010 ప్రకారం వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటును 107.856 శాతం నుంచి 112.992 శాతానికి పెంచింది.
- పార్ట్‌టైం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ. 100 వేతనం పెంచింది.
- ఈ ఉత్తర్వుల జారీకి ముందు ఎవరైనా ఉద్యోగులు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులకు నగదు రూపంలో డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment