
రెండో డిజైన్‌కే ఓకే
ప్రజాప్రయోజనాలు..భూసేకరణ..ఆర్థిక విషయాల దృష్ట్యా జూరాల-పాకాల ప్రాజెక్టుకు సంబంధించి రెండో మ్యాప్ డిజైన్‌కు ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది.
- జూరాల-పాకాల ప్రాజెక్టు సర్వేకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
- టన్నెల్ నిర్మాణం 120 కిలోమీటర్లు
దేవరకొండ: ప్రజాప్రయోజనాలు..భూసేకరణ..ఆర్థిక విషయాల దృష్ట్యా జూరాల-పాకాల ప్రాజెక్టుకు సంబంధించి రెండో మ్యాప్ డిజైన్‌కు ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది. మొదటి మ్యాప్ డిజైన్ ప్రకారమైతే టన్నెల్ 74 కిలోమీటర్లు, రెండో మ్యాప్ డిజైన్ ప్రకారమైతే టన్నెల్ నిర్మాణం 120 కిలోమీటర్లు ఉంటుంది. రెండోడిజైన్‌పై రూ.3 కోట్ల అంచనా వ్యయంతో సర్వేకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే మొదటి డిజైన్‌కు, రెండవ డిజైన్‌కు ఆయకట్టుకు నీరందించడంలో తేడా స్వల్పంగా ఉండడం, రెండవ డిజైన్ ప్రకారం పనులు చేపట్టడం వల్ల త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాననుకున్నట్లుగా సాగిపోతూనే ఉంది. జూరాల-పాకాల ప్రాజెక్టును త్వరితగతిన చేపడతామన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై సర్వే నిర్వహించడానికి ఓ సం స్థకు బాధ్యతలు అప్పగించింది. నిన్న మొన్నటివరకు నక్కలగండి ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయంగా జూరాల-పాకాల ప్రాజెక్టును చేపడుతారన్న ఊహా గానాలతో వేడెక్కిన జిల్లా, ఇటీవల జరిగిన జిల్లాపరిషత్ సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి ఇచ్చిన స్పష్టతతో చల్లారింది. నక్కలగండిపై చిత్తశుద్ధితో ఉన్నామన్న ఆయన వ్యాఖ్యలు ప్రజలకు కొంత ఊరటనిచ్చాయి.
మొదటి డిజైన్‌కి... రెండవ డిజైన్‌కి తేడా ఏంటి?
మొదటి మ్యాప్ డిజైన్ ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా జూరాల రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు మీదుగా 80 కిలోమీటర్ల మేర ఓపెన్‌చానల్‌ను తవ్వుతారు. అనంతరం 74 కిలోమీటర్ల మేర మిడ్‌డిండి (నక్కలగండి ప్రాజెక్టులో అంతర్భాగంగా భావించే సిద్ధాపూర్) వరకు టన్నెల్‌ను (15 మీటర్ల వ్యాసార్థంతో) తవ్వుతారు. తద్వారా నక్కలగండి.. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీలో భాగంగా చేపట్టిన తెల్దేవర్‌పల్లి-నేరడుగొమ్ము వద్ద 7 కిలోమీటర్ల టన్నెల్ గుండా పెండ్లిపాకల ప్రాజెక్టు మీదుగా మల్లేపల్లి, మునుగోడు, చీకటిమామిడి, బ్రాహ్మణవెల్లెంల, మోత్కూ రు, తిరుమలగిరి గుండా వరంగల్ జిల్లా పాకాల సరస్సు వరకు కాల్వను తవ్వే విధంగా డిజైన్ చేశారు. అయితే ఈ మ్యాప్ డిజైన్‌కి, రెండవ డిజైన్‌కి స్వల్పమార్పులు మాత్రమే జరిగాయి. మొదటి మ్యాప్ డిజైన్ ప్రకారం 80 కిలోమీటర్లు ఓపెన్‌చానెల్‌ను తవ్వకుండా, జూరాల నుంచి కేవలం 4కిలోమీటర్ల కాల్వను తవ్వి గుర్రంగడ్డ వద్ద రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా మిడ్ డిండి వరకు 120 కి.మీ. మేర టన్నెల్‌ను తవ్వాలని డిజైన్ చేశారు.
ఎందుకీ మార్పు ?
మొదటి మ్యాప్ డిజైన్ ప్రకారం గుర్రంగడ్డ నుంచి 80 కిలోమీటర్ల మేర వరదకాల్వను నిర్మించడం వల్ల వేలఎకరాల్లో రైతులు భూములను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే భూసేకరణ వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో వ్యయమయ్యే అవకాశముంది. అలాగే భూసేకరణ వల్ల ప్రాజెక్టు నిర్మించడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. 80కిలోమీటర్ల మేర వరద కాల్వను నిర్మించడం వల్ల ఆశిం చిన మేర ఆయకట్టుకు నీరందే అవకాశం కూడా లేదు. వీటన్నింటిని అధిగమించేందుకు 120 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను తవ్వడమే ప్రయోజనంగా భావించిన ప్రభుత్వం రెండవ మ్యాప్‌డిజైన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇదీ.. ప్రయోజనం
► జూరాల - పాకాల ప్రాజెక్టు వల్ల మహబూబ్‌నగర్, నల్లగొండ రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతుంది.
► 35 రోజుల కాలంలో 70 టీఎంసీల నీటిని మళ్లించవచ్చు.
► సుమారు 700చెరువులు, కుంటలను వరద కాల్వల ద్వారా నీరందించి నింపుతారు.
► దీంతోపాటు మరో 30టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడానికి కొత్త రిజర్వాయర్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
► ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ఎత్తిపోతల పథకాలు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే నీటిని ఆయకట్టుకు అందించవచ్చు.
► విదేశీ టెక్నాలజీ అవసరం లేకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ప్రక్రియతో బూమర్ మిషన్ ద్వారా టన్నెల్ తవ్వుతారు.