
సాక్షి, జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతంలో చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గ్రామాల అభివృద్ధికి గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు పలు అ«ధికారాలు, విధులు కట్టబెట్టింది. అభివృద్ధిలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేయడానికి కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. ఇటీవలే పల్లెల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేశారు.
కేవలం నెలరోజుల పాటే కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామానికి ఓ ట్రాక్టర్, ఓ డోజర్ మంజూరు చేసింది. వీటి నిర్వహణకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక నిధులు లేకున్నా..
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజురు చేయకపోయినా గ్రామ పంచాయతీ నిధుల్లో నుంచి కొనుగోలుకు వెసులుబాటు కల్పించింది. పంచాయతీల వారీగా జనాభాకు అనుగునంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి తీర్మానంతో ట్రాక్టర్‌మోడల్‌ను ఎంపిక చేయాలి. ఆ తీర్మాణాన్ని మండల స్థాయిలో నుంచి జిల్లాకు పంపిన తరువాత అక్కడ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే కమిటీ ఆమోదం తెలుపుతుంది. అనంతరం ట్రాక్టర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
జనాభా వారీగా..
500 వరకు జనాభా కలిగిన పంచాయతీలకు 15 హెచ్‌పీ కలిగిన మినీ ట్రాక్టర్, 500 నుంచి 3 వేల జనాభా కలిగిన జీపీలకు 20 నుంచి 21 హెచ్‌పీ కలిగిన మినీ ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. 3 వేల కంటే ఎక్కవ జనాభా కలిగిన జీపీలకు 35 నుంచి 40 హెచ్‌పీ కలిగిన రెగ్యులర్ ట్రాక్టర్ కొనుగోలుకు అనుమతి ఇస్తారు. ఇందులో చిన్న గ్రామ పంచాయతీలకు మహేం ద్ర, యువరాజ్, స్వరాజ్, ఐచర్, మిస్ట్‌బుష్, కుబోటా లాంటి కంపెనీలకు చెందిన మిని ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని సూచించారు.
వీటి విలువ రూ.2.70 లక్షల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఇక పెద్ద గ్రామ పంచాయతీల్లో హెచ్‌ఎంటీ, ప్రీతీ, ఐచర్, స్వరాజ్, జాన్‌డీ, మమేంద్ర, కుబోటా వంటి కంపెనీలకు చెందిన 35 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ట్రాక్లర్లను కొనుగోలు చేయాలి.
కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ..
జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా పంచాయతీ అధికా రి కన్వీనర్‌గా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరు, జిల్లా పరిశ్రమల అధికారి సభ్యులుగా ఉంటారు. అయితే అన్ని జీపీల నుంచి తీర్మాణాలు అందగానే ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించిన అనుమతులు ఇస్తారు.
పచ్చదనం.. పరిశుభ్రతే లక్ష్యం
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీకి కెటాయిచనున్న ట్రాక్టర్ ద్వారా పనిచేయాలి. ట్రాక్టర్‌తోపాటు బ్లెడ్ (చదును చేసే యంత్రం), ట్యాంకర్ సైతం ఇవ్వనున్నారు. ప్రతీ గ్రామంలోని చెత్తాచెదారాన్ని ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించనుండడంతో పల్లెలు శుభ్రంగా మారుతాయని భావిస్తున్నారు. ఇక బ్లేడ్‌లో పిచ్చిమొక్కలను శుభ్రం చేసేందుకు ట్యాంకర్ ద్వారా హరితహారంలో నాటిన మొక్కలకు నీటిని అందించేందుకు వీలుకలుగుతుంది. జీపీల్లోని సిబ్బందిలో ఎవరికైనా ట్రాక్టర్ నడిపిన అనుభవం ఉంటే ఆయనే డ్రైవర్‌గా నియమిస్తారు. ఎవరికి రాని పక్షంలో ట్రాక్టర్ నడపడంలో శిక్షణ ఇప్పిస్తారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం జిల్లాలోని 441 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేస్తాం. జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్ మోడల్ ఉంటుంది. ఆయా గ్రామాల నుంచి ట్రాక్టర్ కొనుగోలుకు సంబంధించిన అంశాలు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి తీర్మాణం అందించాలి.
– డీపీఓ వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment