ఏమిటీ ఇక్కట్లు..?
* ఏపీ సచివాలయాన్ని మరోచోటుకు మార్చండి
* గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్న తెలంగాణ సర్కారు
* ఒకే ఆవరణలో 2 సచివాలయాలతో ఇబ్బందులు.. ‘డి’ బ్లాక్‌లోని ఆంధ్రా అధికారులను ఖాళీ చేయించండి
* నేడు గవర్నర్ వద్ద ఆర్ అండ్‌బీపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని మరో ఆవరణకు తరలించాల్సిందిగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం గవర్నర్ వద్ద రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖపై జరగనున్న సమీక్షా సమావేశంలో అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నారు. ఒకే ప్రాంగణంలో రెండు రాష్ట్రాల సచివాలయాలు ఉండడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఆంధ్రా సచివాలయాన్ని మరోచోటకు తరలించాలని కోరనున్నారు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఎంసెట్, సాగునీరు, విద్యుత్ పీపీఏల రద్దు, ‘నాక్’డీజీ పదవి, రవాణా పన్ను తదితర అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సచివాలయం అంశం మరో వివాదానికి తెరలేపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత సచివాలయాన్ని కూడా రెండుగా విభజించి ఇరు రాష్ట్రాలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఒకేచోట రెండు సచివాలయాలు ఉండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ గవర్నర్‌కు నివేదిక ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
తెలంగాణకు కేటాయించిన ప్రస్తుత నాలుగు బ్లాకులు ఏ మాత్రం సరిపోవడం లేదని, పైగా తమకు కేటాయించిన పలు బ్లాకుల్లో ఆంధ్రా అధికారులు ఇంకా కొనసాగుతున్నారని వివరించనున్నారు. అలాగే ప్రస్తుతం కేటాయించిన నాలుగు బ్లాకుల్లో విస్తీర్ణం లెక్కలతోపాటు సీమాంధ్రకు కేటాయించిన బ్లాకుల విస్తీర్ణం కూడా లెక్కించారు. ఆ వివరాలను కూడా గవర్నర్‌కు సమర్పించనున్నారు. పార్కింగ్ సమస్య తీవ్రమవుతోందని, ఏపీ సచివాలయానికి వచ్చే సందర్శకులు కూడా ఇక్కడ కార్లు పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించనున్నారు. అంతేకాకుండా ఆంధ్రా సచివాలయాన్ని మరో ప్రాంతానికి తరలించడానికి ముందు.. నిజాం కాలంనాటి హెరిటేజ్ భవనం సైఫాబాద్ ప్యాలెస్ (ప్రస్తుతం జీ బ్లాక్... గతంలో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు వినియోగించిన సంహిత బ్లాక్)ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.
అలాగే తెలంగాణలోని ‘డీ’ బ్లాక్‌లో ఉన్న ఆంధ్రా అధికారులను వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయించాలని కోరనున్నారు. సీమాంధ్రకు కేటాయించిన బ్లాకుల్లో ఇరు రాష్ట్రాలు వినియోగించుకోవాల్సిన లైబ్రరీలో ఓ గదిని ఆంధ్రా అధికారులకు కేటాయించారని..బ్యాంకులు, పోస్టాఫీసు, క్యాంటీన్లు తదితర వాటిని ఆంధ్రా ప్రాంతానికే పరిమితం చేసేలా చర్యలు సాగుతున్నాయని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ఇటీవల సీమాంధ్ర ఉద్యోగుల సంఘం నాయకులు కొందరు గవర్నర్‌ను కలిసి, కామన్ యుటిలిటీగా ఉన్నవాటిని సీమాంధ్రకు కేటాయించి, తెలంగాణకు కొత్తవాటిని ఏర్పాటు చేసుకునేలా చూడాలని కోరినట్లు సర్కారు దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే టీ సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కాగా, ఉద్యోగుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు దేవీప్రసాద్, సచివాలయ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) అజయ్‌మిశ్రాను కలిసి కామన్ యుటిలిటీ సర్వీసులపై ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్‌కు నివేదిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు దేవీప్రసాద్ తెలిపారు.