తెలంగాణ స్థలమంటూ బోర్డు ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ)కి కేటాయించిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంది. నిబంధనల ప్రకారం స్థలాన్ని వినియోగించుకోకపోవడంతో ఈ 16 ఎకరాల 900 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని విలువ దాదాపు రూ. 520 కోట్లు ఉంటుందని అంచనా. చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి, స్టూడియోల నిర్మాణం చేపట్టేందుకు 1991లో అప్పటి ప్రభుత్వం ఎఫ్‌డీసీకి స్థలాన్ని కేటాయించింది.
షేక్‌పేట మండల పరిధిలో సర్వే నెంబర్ 403, టీఎస్ నెంబర్-1, బ్లాక్-హెచ్, వార్డు-9 ఫిలింనగర్ పద్మాలయా స్టూడియో వెనుక 16 ఎకరాల 900 గజాల స్థలాన్ని ఇచ్చారు. నిర్మాణాలు చేపట్టకపోవడంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ ముకేష్‌కుమార్ మీనా, షేక్‌పేట తహసీల్దార్ చంద్రకళ ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అది తెలంగాణ ప్రభుత్వ స్థలమని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
స్వాధీనం చేసుకున్న స్థలంలో బస్తీ..
ఎఫ్‌డీసీకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే పద్మాలయా అంబేద్కర్‌నగర్ బస్తీ ఏర్పాటయినట్లు రెవెన్యూ అధికారు లు గుర్తించారు. ఈ బస్తీలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. అయితే అక్కడి వారిని ఖాళీ చేయిస్తారా? క్రమబద్ధీకరించి ఆవాసం కల్పిస్తారా? అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. వారికి ముందుగా నోటీసులు జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో తమ పరిస్థితి ఏమవుతుందోనని బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఎఫ్‌డీసీకి కేటాయించిన స్థలం వెనక్కి..
Published Sat, Jul 5 2014 3:31 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM
Advertisement