టీ హబ్ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో మాట్లాడుతున్న ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తు అంతా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లదేనని, అందుకే రాష్ట్రాన్ని స్టార్టప్‌ల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎక్కువగా వాటితోనే ఉండనున్న నేపథ్యంలో అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్‌గా(ఏఐ) ప్రభుత్వం ప్రకటించిందని, ఏఐని అన్ని కాలేజీలు ప్రవేశపెట్టేలా చూడాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో వస్తున్న మార్పులపై సోమవారం అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 రోజుల అంతర్జాతీయ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే త్రీఐ మంత్రాను తాను బలంగా నమ్ముతాన న్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీహబ్ ప్రారంభించామన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఐటీ, ఇతర పరిశ్రమలను తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాల పెంపునకు పక్కా చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఏఐసీటీఈకే మోడల్‌గా తెలంగాణ నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి కల్పించే 14 రంగాలను గుర్తించి, ఆయా రంగాల్లో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టిందన్నారు.
టీఎస్‌ఐపాస్ ద్వారా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి ఉద్యోగావకాశాలు మెరుగు పరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 28 వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులలో నైపుణ్యం లేదని తమకు పరిశ్రమల నుంచి ఫిర్యాదులు అందాయని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపునకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్‌ను(టాస్క్) ఏర్పాటు చేశామన్నారు. ఐదేళ్లలో టాస్క్ 680 కళాశాలల్లో 5,070 మంది అధ్యాపకులకు, 2.9 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చిందన్నారు. టాస్క్‌ను వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ వంటి నగరాలకు విస్తరింపజేస్తామన్నారు. అనురాగ్ కాలేజీ తరహాలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందేలా కృషి చేయాలన్నారు.
ఐటీ ఇక ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
‘ఐటీ’ఇకపై ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’గా కాకుండా ‘ఇంటెలిజెన్స్ టెక్నాలజీ’గా పునర్‌నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రొబోటిక్స్ వంటి సబ్జెక్టులను తీసుకువచ్చి పరిశ్రమలతో అనుసంధానం కావాలన్నారు. తమ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలపై దృష్టి సారించిందన్నారు. జర్మనీ తరహాలో ప్రాక్టీస్ స్కూల్ ఆప్షన్‌ను మన పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలన్నారు. పరిశ్రమల అవసరాలను గుర్తించి అప్రెంటిస్‌షిప్ అమలు చేయాలన్నారు. ఈ కొత్త విధానాలను జేఎన్‌టీయూహెచ్ సీరియస్‌గా పరిశీలిస్తోందని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి అప్రెంటిస్‌షిప్ అమల్లోకి వస్తుందని ఆశిద్దామన్నారు.
వందశాతం అక్షరాస్యత ధ్యేయం
సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘ఈచ్‌వన్ టీచ్‌వన్’నినాదంతో అక్షరాస్యత శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను వందశాతం అక్షర్యాత గల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, సాంకేతిక విద్యలో ప్రమాణాలు పెంపొందిస్తున్నామన్నారు. ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అక్కడి విద్యా సంస్థలే ఇక్కడికి వచ్చేలా ప్రైవేటు వర్సిటీల చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందన్నారు.
అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో బోధనా వృత్తి ఎన్నో సవాళ్లను ఎదుర్కొం టోందన్నారు. సదస్సులో సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నీలిమ, ఐఐటీహెచ్ మాజీ డైరెక్టర్ యు.బి.దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీటీఐఈఈ –2020 సావనీర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment