పార్లమెంటరీ కార్యదర్శులకు మంగళం
- నియామకం, భత్యాల జీవోల ఉపసంహరణ
- గత నెల 23నే మెమో జారీ చేసినట్లు హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్
- కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను పరిష్కరించిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది. వారి నియామకపు జీవోతో పాటు వారికి పలు భత్యాలను మంజూరు చేస్తూ జారీ చేసిన జీవోను సైతం ఉపసంహరించుకున్నామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.
ఈ మేరకు గత నెల 23న సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వికాస్ రాజ్ పేరు మీద జారీ అయిన మెమోను ఆయన కోర్టుకు చూపారు. పరిశీలించిన హైకోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి తదితరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు ధర్మాసనం, పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం చట్ట విరుద్ధమని గత నెల 1న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారిపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం ధర్మాసనం విచారించింది.