* మైసూర్ దసరా ఉత్సవాలను మరిపించేలా చేస్తాం: కేసీఆర్
* పండుగ నిర్వహణకు రూ. 10 కోట్లు, ప్రతి జిల్లాకు రూ. 10 లక్షలు
* సర్వాంగ సుందరంగా హైదరాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్
* మహిళా సీఎంలు, లోక్‌సభ స్పీకర్, మహిళా ప్రముఖులకు ఆహ్వానం
* 25 వేల బతుకమ్మలతో భారీ ఊరేగింపు
* హరివిల్లు నేలకు దిగిందనిపించేలా ఏర్పాట్లు: సీఎం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మైసూర్‌లో ఘనంగా నిర్వహించే దసరా ఉత్సవాల మాదిరిగా తెలంగాణ బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రపంచం అబ్బురపడే రీతిలో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుతామని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ రోజు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై గొప్ప వేడుక నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది సద్దుల బతుకమ్మ వేడుక, దసరా పండుగ ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు.
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నమైన బతుకమ్మ పండుగను ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు యావత్ దేశం దృష్టిని ఆకర్షించే విధంగా అట్టహాసంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు ఏర్పాట్ల కోసం రూ. 10 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో నుంచి అన్ని జిలాల కలెక్టర్లకు వెంటనే రూ. 10 లక్షల చొప్పున పంపించాలని అధికారులకు సూచించారు.
మహిళా సీఎంలకు ఆహ్వానం
ఈ పండుగకు వివిధ రాష్ట్రాల మహిళా సీఎంలు జయలలిత, వసుంధరరాజే, ఆనందీబెన్, మమతాబెనర్జీలతో పాటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మహిళా మంత్రులు, మహిళా గవర్నర్లు, అలాగే కిరణ్‌బేడీ, మేధా పాట్కర్, అరుంధతీ రాయ్ వంటి ప్రముఖులను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. విదేశీ మహిళా ప్రముఖురాలిని గౌరవ అతిథిగా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. అందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భార్యలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. తెలంగాణకు ఇది ప్రత్యేకమైనదే కాకుండా.. జీవితంతో ముడిపడి ఉన్న పండుగ అని, అన్నింటికీ మించి తెలంగాణ సెంటిమెంట్‌కు బతుకమ్మ పండుగకు అవినాభావ సంబంధం ఉందని కేసీఆర్ అన్నారు.
బతుకమ్మ స్క్వేర్!
ఈ ఏడాది ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ పండుగను నిర్వహించుకుని, వచ్చే ఏడాది నుంచి ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన నెక్లెస్‌రోడ్డులో బతుకమ్మ స్క్వేర్‌ను నిర్మించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ఢిల్లీతో పాటు తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయం, రేల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద హోర్డింగ్స్ పెట్టాలని, హైదరాబాద్‌లోని అసెంబ్లీ, తదితర భవనాలకు 9 రోజుల పాటు లైటింగ్, సీరియల్ బల్బులు ఏర్పాటు చేయాలని సూచించారు. నవరాత్రుల వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని, ట్యాంక్‌బండ్‌ను, హుస్సేన్‌సాగర్ పరిసరాలను శోభాయమానంగా తిర్చిదిద్దాలని చెప్పారు.
హుస్సేన్‌సాగర్ నీటిలోనూ లైట్లు, రకరకాల ఫౌంటెయిన్లు ఏర్పాటుచేయాలని, సద్దుల బతుకమ్మ రోజు హుస్సేన్‌సాగర్ చుట్టూ బతుకమ్మ పాటలు వినిపించే విధంగా మైకులు ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో పండుగను గొప్పగా నిర్వహించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. చెరువుల వద్ద లైటింగ్, పరిసరాల శుభ్రత, చెరువుకు వెళ్లే రోడ్ల మరమ్మతులు వంటి చర్యలు తీసుకునేలా సర్పంచులకు సర్క్యులర్లు జారీ చేయాలని ఆదేశించారు. అన్ని దేవాలయాలను సుందరంగా అలంకరించాలని, ముఖ్య కూడళ్లలో లైట్లతో తయారు చేసిన బతుకమ్మలను ప్రదర్శించాలన్నారు.
తెలంగాణకు చెందిన మహిళా సివిల్ సర్వీసెస్ అధికారులు, రాష్ట్ర స్థాయి మహిళా అధికారులు కూడా రాష్ట్ర రాజధానిలో జరిగే పండగలో పాల్గొనాలని సీఎం ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య, డెరైక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఘనంగా తొలి బతుకమ్మ పండుగ: కవిత
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి వస్తున్న బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తామని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమీక్ష అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 24 నుండి వచ్చే నెల 2 వరకూ తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు జరుగుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి కలసి సంయుక్తంగా సంబూరాలను నిర్వహించనున్నట్టుగా తెలిపారు. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్‌బండ్ వరకూ బతుకమ్మల ఊరేగింపు ఉం టుందని, దేశంలోని మహిళా ముఖ్యమంత్రులను, మహిళా కేంద్రమంత్రులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళలను ఆహ్వానిస్తున్నట్టుగా వెల్లడించారు.
ఎల్‌బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపు
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎల్‌బీ స్టేడియంలో బతుకమ్మలు పేర్చుకుని, దాదాపు 25 వేల మంది మహిళలు అక్కడి నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వస్తారు. ట్యాంక్‌బండ్‌పైనే పెద్ద వేదిక ఏర్పాటు చేసి.. ఈ వేడుకకు వచ్చే ప్రముఖులకు దానిపై చోటు కల్పిస్తారు. ట్యాంక్‌బండ్‌పైనే మహిళలు బతుకమ్మ ఆడతారు.
ఈ ఊరేగింపులో భాగంగా మంగళవాయిద్యాలు, మేళతాళాలు, తెలంగాణ కళలు ప్రదర్శిస్తారు. హైదరాబాద్‌లో 25 వేల మంది మహిళలు బతుకమ్మలతో తరలివెళుతుంటే ఆకాశంలోని హరివిల్లు నేలకు దిగిందా అన్నట్లుగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. దాదాపు 10 వేల బతుకమ్మలను ఎల్‌బీ స్టేడియంలో ప్రభుత్వ సహకారంతో పేర్చాలని, కావాల్సిన గునుగు, తంగేడు వంటి పువ్వులను జిల్లాల నుంచి తెప్పించాలని సమావేశంలో నిర్ణయించారు.
సోనియాను ఆహ్వానించరా: కేసీఆర్‌కు మహిళా నేతల ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించకపోవడాన్ని మాజీ మంత్రు లు జె. గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి తప్పు పట్టారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యేది కాదని, ఈ విషయం తెలిసిన కేసీఆర ఉత్సవాలకు ఆమెను పిలవకపోవడం విశ్వాసఘాతుకానికి నిదర్శనమన్నారు.
అంగరంగ వైభవంగా బతుకమ్మ
Published Sat, Sep 13 2014 1:49 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement