
కళల నిలయమైన అమెరికాలోని డాలస్.. మన తెలుగువారి పండుగల అందాలనూ అద్దుకుంటోంది. తంగేడు వనాన్ని, గునుగుపూల సోయగాన్ని ఇముడ్చుకుని తెలంగాణ పండుగ బతుకమ్మకు మరింత కళను జోడించింది. చరిత్ర సంరక్షణకూ పెట్టింది పేరైన ఆ పట్టణం.. మన బతుకమ్మ, దసరా పండుగల సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అక్కడ నివసిస్తున్న తెలంగాణ ప్రజల సమూహం తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్).. ఏ విదేశాలలో నిర్వహించలేనంత వైభవంగా, ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రత్యేకతను చాటింది.
దాదాపు పదిహేను వేల మంది హాజరై మహా సందడి చేసిన ఈ కార్యక్రమానికి డాలస్ పరిధిలోని ఫ్రిస్కో పట్టణంలో గల కొమెరికా సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా స్టేడియం) వేదికగా నిలిచింది. ఏటా బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి దృష్టిని టీపాడ్ ఆకర్షించి సంగతి తెలిసిందే. దీంతో టీపాడ్ ఆతిథ్యం గురించి తెలుసుకుని పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, ఆర్కన్సాస్లో ఉంటున్న తెలుగువారూ అక్కడికి విచ్చేసి సందడి చేశారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సుమారు 6మంది మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ లయబద్దంగా కదులుతుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజాము వరకు వేడుకలు కొనసాగాయి. స్థానిక డ్యాన్స్ స్కూల్స్ విద్యార్థుల నృత్యాలతో వేడుక మొదలయింది. అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టుగా నవదుర్గ వేషధారణతో అమ్మాయిల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. నాలుగు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం విజయదశమి వేడుకలను నిర్వహించారు. శమీపూజ చేశారు. సినీనటి రీతూవర్మ ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఆపై అందరినీ ఆహ్లాదపరుస్తూ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం తమ పాటలు, సంగీతంతో కొత్త లోకంలో విహరించేలా చేసింది. గాయకులు లిప్సికా, రోల్ లైడా, ధనుంజయ్ తదితరులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను తెలంగాణ పీపుల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) Telangana people’s association of Dallas (T pad) భారీ కసరత్తే చేసింది. దాదాపు నెలరోజుల క్రితమే అసోసియేషన్ బృందం కమిటీలు గా ఏర్పడి బాధ్యతలను తీసుకున్నారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమం ఆసాంతం విజయవంతమయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా, స్థానిక, జాతీయ తెలుగు సంస్థలకు, దాతలకు, మీడియా సంస్థలకు తమ కార్యక్రమాలకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న డాలస్ లోని తెలుగు వారందరికీ TPAD నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment