టీపీఏడీ బతుకమ్మ సంబరాలకు భారీ ఏర్పాట్లు
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో 2016 బతుకమ్మ, దసరా సంబరాల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అక్టోబర్ 8న నిర్వహించే ఈ వేడుకలకు సుమారు 10 వేల మంది హాజరౌతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వెలుపల నిర్వహించే అత్యంత భారీ బతుకమ్మ వేడుకలు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ్రిస్కోలోని డా. పెప్పర్ ఎరినా వేదికగా జరిగే ఈ వేడుకలకు తెలుగు ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన వస్తోందని టీపీడీఏ వెల్లడించింది. ఏటీఏ, టీఏటీఏ, ఎన్ఏటీఏ, టీఏఎన్ఏ, ఎన్ఏటీఎస్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీఏఎన్టీఈఎక్స్, ఐఏఎన్టీ, టీఈఏ, మనబడి లాంటి సంఘాలు ఈ వేడుకలకు పూర్తి మద్దతు తెలిపాయి. వేడుకలకు హాజరయ్యే భారీ సమూహానికి సౌకర్యంగా ఉండటం కోసం వేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేసినట్లు టీపీడీఏ తెలిపింది. ఒకేసారి 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేయడం విశేషం. సంబరాలను వీక్షించడానికి భారీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు.
ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం నుంచి బతుకమ్మ, జమ్మిపూజ, మ్యూజిక్ బొనాంజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రాశీఖన్నా, రెజీనా, గీతా మాధురి, సాకేత్, ఇషా రబ్బా, షామిలి, నరేంద్ర లాంటి టాలీవుడ్ ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే రోజా, గరికపాటి రామ్మోహన్ రావ్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం వేడుకలకు హాజరౌతారని నిర్వాహకులు వెల్లడించారు.