టార్గెట్‌ 4 వేల చెరువులు | Telangana Govt Target Full The Ponds With Kaleshwaram Water | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 4 వేల చెరువులు

Published Mon, Apr 22 2019 1:17 AM | Last Updated on Mon, Apr 22 2019 1:17 AM

Telangana Govt Target Full The Ponds With Kaleshwaram Water - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జూలై, ఆగస్టు నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం... తొలి ప్రాధాన్యం కింద చెరువులన్నింటినీ నింపేలా ప్రణాళిక వేస్తోంది. ఈ వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపాలని, దీనికోసం కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి పనులు చేపట్టాలన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఇంజనీర్లు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వరదనీరు, పడబాటు నీళ్లు చెరువులకు మళ్లాలన్న సూచనల మేరకు ఎక్కడెక్కడ గరిష్ట చెరువులను నింపే అవకాశాలపై దృష్టి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 4 వేల చెరువులకు నీరందించాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 500 చెరువులనైనా నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.

చెరువులకు జలకళే లక్ష్యం..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నారం, సుందిళ్లలో గేట్లు అమ ర్చే ప్రక్రియ పూర్తవగా మేడిగడ్డలో ఈ ప్రక్రియ కొన సాగుతోంది. పంప్‌హౌస్‌లో మోటార్ల ఏర్పాటు కొన సాగుతుండగా జూన్, జూలై నాటికి ఇవి పూర్తికాను న్నాయి. ఇక ఎల్లంపల్లి దిగువన ఇప్పటికే ప్యాకేజీ– 6లో ట్రయల్‌ రన్‌ కొనసాగుతోంది. సర్జ్‌పూల్‌లో లీకేజీల గుర్తింపు ప్రక్రియ కొనసాగు తుండగా ఈ నెల 24న 129 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్లకు వెట్‌ రన్‌ నిర్వహించనున్నారు. అనంతరం ప్యాకేజీ– 7లోని టన్నెళ్ల ద్వారా నీటిని విడుదల చేసి ప్యాకేజీ–8 పంప్‌హౌస్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మే నెలాఖరుకు పూర్తి కానుంది. ఇక మిడ్‌ మానేరుకు వచ్చే నీటిని మల్లన్నసాగర్‌కు తరలించే పనులను ప్యాకేజీ 10, 11, 12గా విడగొట్టగా అనంతగిరి, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్ల పను లు జూన్‌ నాటికి పూర్తి కానున్నాయి. వాటి పరిధిలో పంపుల బిగింపు ప్రక్రియ కూడా మొదలైంది.

మొత్తంగా జూన్‌ నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం కాలు వలను సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తవనున్న దృష్ట్యా కాళేశ్వరం ద్వారా వచ్చే గోదా వరి జలాలతో తొలి ప్రాధాన్యంగా చెరువులు నింప నున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వరదనీరు, పడబాటు నీళ్లు అన్ని చెరువులకు మళ్లేలా పనులు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు బస్వాపూర్‌ వరకు గరిష్టంగా 4 వేల చెరువులు నింపే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో మిడ్‌మానేరు దిగువన బస్వాపూర్‌ వరకు 2,200 చెరువులు నింపే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇక ఎస్సారెస్పీ స్టేజ్‌–1, స్టేజీ–2 కింద 500–600 చెరువులు, కడెం కింద 50 చెరువులు, వరద కాల్వ కింద 60 చెరువులు నింపవచ్చని గుర్తించారు. ఇందులో ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే ఎస్సారెస్పీ కింద 200 చెరువులు, అనంతగిరి కింద సిరిసిల్ల జిల్లాలో 30 చెరువులు నింపి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. రంగనాయక సాగర్‌ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపనున్నారు. ఈ రిజర్వాయర్ల పనుల అనంతరం మల్లన్నసాగర్‌కు చేరే నీటిని ఫీడర్‌ చానల్‌ తవ్వి గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింది కాలువలకు అనుసంధానించి కనిష్టంగా 150 చెరువులు నింపేలా పనులు చేస్తున్నారు. మరిన్ని చెరువులను నింపేందుకు కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి పనులు చేపట్టనున్నారు.

సామర్థ్యాల లెక్క తీయండి..
మేడిగడ్డ నుంచి బస్వాపూర్‌ వరకు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద, ప్యాకేజీ–21, ప్యాకేజీ–22ల కింద ఎన్ని చెరువులు నింపగలు గుతారు? వాటి సామర్థ్యం, ఆయకట్టు ఎంత? వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని అధికారులతో గత వారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడెక్కడ తూములు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయవచ్చో తేల్చాలన్నారు. ఇప్పటికే మిడ్‌మానేరు దిగువన 2,200 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ చెరువుల్లో 25 టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇదే మాదిరి అన్ని చెరువుల కింద సామర్థ్యాలను తేల్చాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement