సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నం.46లోని 84 ఎకరాల 30 గుంటల భూములపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ఇప్పటికే రిట్ దాఖలైందని, ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పడంతో విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. భూములపై కోర్టు వ్యాజ్యాలు ఉన్న తరుణంలో అవి భూ కబ్జాదారులు ఆక్రమించకుండా పోలీసుల రక్షణ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని లార్వెన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఇతరులు రిట్ దాఖలు చేశారు. ఈ భూములు తమవేనని, రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లను మ్యుటేషన్ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ మరో రిట్ కూడా దాఖలైంది.
వీటిని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వ్యతిరేకించారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని, వాటి విషయంలో ప్రభుత్వానికే సర్వ హక్కులు ఉన్నాయని చెప్పారు. 1946లో ఇచ్చిన డిక్రీని అడ్డం పెట్టుకుని భూముల్ని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని, వీటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి భూములను కాపాడుతోందని చెప్పారు. గతంలో కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ 7, సీఎస్ 14ల్లోని భూములకు చెందిన పత్రాలు అన్నింటినీ కోర్టు ఆఫ్ వార్డు స్వాధీనంలో ఉంచామని తెలిపారు. ఇప్పటికే ఈ భూములపై కోర్టు ధిక్కార కేసు కూడా నమోదైందని, ఇప్పుడే ఈ వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment