సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 6 జోన్లు.. 30 సర్కిళ్లు.. 150 వార్డులున్నాయి. నగరంలో కోవిడ్– 19 కేసుల విస్తరణ బాగా పెరిగిపోయింది.దీని వ్యాప్తి ఏ ప్రాంతంలో ఎక్కడ ఎక్కువగా ఉందో
తెలిస్తే.. ఆ ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్త పడేందుకు వీలవుతుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా పాజిటివ్ కేసుల వివరాల్ని ఏరోజుకారోజు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకు తెలియజేయాలని హైకోర్టు
ఆదేశించింది. తద్వారా అసోసియేషన్లు, ప్రజలు వ్యాధి నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, ప్రజలు కూడా జాగ్రత్త పడతారని తెలిపింది. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో కోర్టుకు విన్నవించేందుకే కాబోలు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం మొక్కుబడిగా వెబ్‌సైట్‌లో కోవిడ్– 19 వివరాలుంచామంటూప్రకటించింది. ఆ వివరాలు చూద్దామనుకున్న వారు తెల్లబోయారు.
సాధారణంగా వెబ్‌సైట్‌లో ఏదైనా ముఖ్య విషయం.. అందరికీ పనికివచ్చేది కొత్తగా ఉంచినప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే కనబడేలా స్క్రోల్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అలాంటిదేమీ లేదు సరికదా.. కరోనా కేసులు ఎక్కడ ఉన్నాయో అనౌన్స్‌మెంట్స్ విభాగంలో వెదుక్కుంటేనే కోవిడ్ డీటెల్స్ అని ఉంది. అందులోకి వెళ్తే మండలం పేరు, పేషెంట్ ఐడీ ,లింగం, వార్డు, సర్కిల్, జోన్‌లుగా టేబుల్ ఉంది. టేబుల్‌లో చాలాచోట్ల మండలం లేదు. మిగతా వివరాలున్నప్పటికీ, ఏదైనా ప్రాంతం వారు తమ పరిధిలో ఎన్ని కేసులున్నాయో తెలుసుకోవాలంటే వివరాల్లేవు. పోనీ కనీసం ‘సెర్చ్’ వంటిది ఉండి వార్డు లేదా సర్కిల్ లేదా జోన్‌ల వారీగా తెలుసుకోవచ్చునేమో అనుకుంటే అదీ లేదు.
ఏదో మొక్కుబడిగా..
37వేలకు పైగా పేషెంట్స్ ఐడీలు ఉన్న జాబితాలో ఎవరైనా తమ వార్డు లేదా సర్కిల్‌లో ఎన్ని కేసులున్నాయో తెలుసుకోవాలనుకుంటే వార్డు లేదా సర్కిల్ పేరు ఉన్న ప్రతిచోటా ఒక్కటొక్కటిగా లెక్కించుకుంటూ వెళ్లాలన్న మాట. ఈ లెక్కన దానికెంత సమయం పడుతుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. అన్ని వేలల్లో కచ్చితంగా లెక్కించడం కూడా సాధారణ ప్రజలకు సాధ్యమయ్యే పని కాదు. కేవలం హైకోర్టుకు సమాధానం ఇచ్చేందుకే హడావుడిగా వెబ్‌సైట్‌లో ఇలా ఉంచారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. శనివారం నాడే ఈ వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచగా, వివరాలు సరిగా లేవని, వార్డుల వారీగా ఎలా తెలుసుకుంటారని ఆ రోజునుంచే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయింది. మొదటి రోజు అలా ఉంచినప్పటికీ, క్రమేపీ వార్డుల వారీగా వివరాలు అప్‌డేట్ చేస్తారేమోనని పలువురు భావించారు. కానీ.. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇలా ఉంచడం వల్ల ఎవరికి ఉపయోగపడుతుందో, ఎలా ఉపయోగపడుతుందో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో జీహెచ్‌ఎంసీ యంత్రాంగానికే తెలియాలి.
ఆ వివరాలుంటేనే ప్రయోజనం..
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీలో పాజిటివ్ కేసుల వివరాలను వార్డుల వారీగా రోజూ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. వివరాలను సంబంధిత కాలనీ అసోసియేషన్లకు, మీడియాకు తెలియజేస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. కానీ.. జీహెచ్‌ఎంసీ ఆ పని చేయలేదు. దేశంలోని కొన్ని నగరాల్లో ఏరియాల వారీగా వివరాలు వెల్లడిస్తున్నా.. జీహెచ్‌ఎంసీలో ఆ పని జరగడం లేదు. కోవిడ్– కంట్రోల్‌రూమ్ పేరిట వెలువరించే ప్రకటనలో కేవలం ఎన్నిఫోన్లు వస్తున్నాయి.. ఎన్ని అన్నపూర్ణ భోజనాలు పంపాం అన్న వివరాలు మాత్రం వెలువరిస్తున్నారు. ప్రజలకు కరోనా తీవ్రత తెలిసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా కరోనా మొదలైనప్పటి నుంచి ఎన్ని పాజిటివ్ కేసులు.. ఎంతమంది కోలుకున్నారు.. మరణాలెన్ని.. ఏరోజుకారోజు ఎన్ని కేసులు తదితర సమాచారంతోపాటు వార్డుల వారీగా వివరాలుంటేనే ప్రయోజనమని నగర ప్రజలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment