అద్భుతం ఆవిష్కృతమైంది..! | Telangana household survey success, says kcr | Sakshi
Sakshi News home page

అద్భుతం ఆవిష్కృతమైంది..!

Published Wed, Aug 20 2014 1:47 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

అద్భుతం ఆవిష్కృతమైంది..! - Sakshi

అద్భుతం ఆవిష్కృతమైంది..!

 గతంలో ఎక్కడా లేనివిధంగా సర్వే జరిగింది
 ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేతో గొప్ప అద్భుతం ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే తొలిసారి ప్రజల భాగస్వామ్యంతో అందరూ ఆశ్చర్యపడేలా అద్భుతంగా ఈ సర్వే జరిగిందని పేర్కొన్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, బి.నర్సయ్యగౌడ్‌లతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమగ్ర సర్వేపై చిలువలు పలువలుగా అసత్య ప్రచారం చేసిన ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పారని, దాంతో ఆయా నేతల ముఖాలు మాడిపోయాయని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో 98 శాతం మేరకు సర్వే జరిగిందని వెల్లడించారు. ఎన్యూమరేటర్లు తమ ప్రాంతాలకు రాలేదని ప్రజలు ధర్నాలు చేయడం చూస్తుంటే, వారు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఎంత ఆదుర్దా కనబరిచారో అర్థమవుతోందన్నారు. ముంబై, భీవండి, సూరత్, అహమ్మదాబాద్‌ల నుంచి రైళ్లలో.. జెడ్డా, గల్ఫ్‌ల నుంచి ప్రత్యేక విమానాల్లో ప్రజలు సర్వే కోసం రావడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఉంచిన నమ్మకం, గౌరవానికి ఇది నిదర్శనమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మొత్తం భారతదేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సర్వే జరిగిందని చెప్పారు. సరైన పద్ధతిలో ఏ పని చేసినా ఫలితం గొప్పగా ఉంటుందనే విషయాన్ని నిరూపించిన తెలంగాణ ప్రజలకు ఆయన కృత జ్ఞతలు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో మంగళవారం తమ వివరాలను నమోదు చేసుకోలేకపోయిన కుటుంబాలకు మరో అవకాశం ఇవ్వడంపై బుధవారం తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్ వంటి నగరాలు, జిల్లాల్లో ఎక్కడైనా మిగిలిపోయిన వారి విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు. సర్వేలో భాగంగా అడిగిన ప్రశ్నల ద్వారానే తమకు అవసరమైన సమాచారం అందుతుందని, అది తమకే అర్థం అవుతుందని పేర్కొన్నారు. అవసరమైన మేర సమాచారం లేదని భావిస్తే మళ్లీ సర్వే నిర్వహిస్తారా అని అడగ్గా.. ఆ అవసరముంటే మళ్లీ చేద్దామని బదులిచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
 
 ఇంతకాలం చీకట్లో ఉన్నాం
 
 ‘‘ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం స్పష్టమైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులు ఉదయం 5 గంటల నుంచే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నడుంబిగించారు. వారికి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. బ్యాంకు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థులు ఇలా సర్వేలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. సరైన వివరాలు, సమాచారం లేకుండా మనం ఇప్పటివరకు చీకట్లో ఉన్నాం. సర్వేతో అందిన వివరాలతో అద్భుతాలు సృష్టిద్దామని తెలంగాణ ప్రజలకు హామీనిస్తున్నాను. తెలంగాణలోని జనాభాపై ఏవో లెక్కలున్నప్పటికీ తాజా సర్వే ప్రకారం నాలుగున్నర కోట్ల వరకు ఇక్కడి జనాభా ఉండొచ్చునని తెలుస్తోంది. హైదరాబాద్ జనాభాపైనా స్పష్టత వస్తుంది. ఇక్కడ దాదాపు 1.2 కోట్ల మంది ఉన్నట్టు అంచనా. ఈ వివరాలను బట్టి నగరానికి ఎంత నీరు అవసరం, ఇతరత్రా అవసరాలకు ఎంత కేటాయించాలో తెలుస్తుంది.
 
 నవ్వినోళ్ల మొహాలే నల్లబడ్డాయ్
 
 ఇంత సులభతరంగా చేస్తున్న సర్వేను కొంతమంది చిలవలు పలువలు చేసి, చిల్లరమల్లర చేసి వాళ్ల పరువు వారే తీసుకున్నారు. ఇలాంటి అంశాలపై విపక్ష పార్టీలు భవిష్యత్‌లో ప్రజల మూడ్ తెలుసుకుని వ్యవహరిస్తే మంచిది. ఈ సర్వే విజయవంతమైన తీరును చూసైనా విమర్శకులకు కనువిప్పు కలగాలి. సర్వేలో పూర్తిగా భాగస్వాములు కావడం ద్వారా ప్రజలు వారి చెంపలు చెళ్లుమనిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఆంధ్ర ప్రాంత మిత్రులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇందులో పాలుపంచుకున్నారు. మొత్తమ్మీద ప్రజలు చాలా సౌకర్యవంతంగా ఫీలయ్యారు. జీహేచ్‌ఎంసీ పరిధిలో అయితే తమ ప్రాంతానికి ఎన్యూమరేటర్లు రావడం లేదంటూ ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి అడగడం, కొన్నిచోట్ల ధర్నాలు చేయడం సర్వే పట్ల వారికున్న ఆసక్తిని స్పష్టంచేస్తోంది. ప్రభుత్వం ఇట్లా కూడా పనిచేస్తుందా అని ప్రజ లు చేసి చూపించారు. ప్రజలు కలలు కనే తెలంగాణను సాధించుకునేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. ప్రజల సహకారం ఇలాగే ఉంటే బంగరు తెలంగాణను వారి చేతుల్లో పెడతా.
 
 15 రోజుల్లో క్రోడీకరణ
 
 సర్వే వివరాలు బహుముఖంగా ఉపయోగపడతాయి. దీని ద్వారా ప్రభుత్వపరంగా చాలా నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది. పది పదిహేను రోజుల్లో మొత్తం డేటాను కంప్యూటరీకరించి సీఎం, సీఎస్, మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, హెచ్‌ఓడీలు, కలెక్టర్లు, జేసీలు, ఆర్డీఓలు, ఎమ్మార్వోల వరకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతీ గ్రామంలో ఐటీ కనెక్టివిటీ అందుబాటులో రానున్నందున ప్రతి గ్రామపంచాయితీలో కూడా ఈ సమాచారం అందుబాటులోకి వస్తుంది. భూమి, ఇళ్లు, పెన్షన్ ఇలా అన్ని సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందేందుకు ఉపయోగపడుతుంది. మేం జరిపిన తరహాలోనే ఇతర రాష్ట్రప్రభుత్వాలు కూడా సర్వేలు నిర్వహించుకుంటే ఫలితం ఉంటుంది. సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ పథకాలు సరైనవిధంగా ప్రజలకు చేరేందుకు అవసరమైన సమాచారాన్ని పొందేందుకు సర్వే ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ఆలోచించాల్సిందిగా ఇతర రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రానికి కూడా ఈ సర్వే కనువిప్పు అవుతుంది.
 
 నా బిడ్డలు తప్పుచేసినా జైల్లోనే..
 
 ప్రభుత్వపరంగా ఒక్కపైసా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వంలో అసలు అవినీతికి తావు లేకుండా చర్యలు చేపడతాం. చివరకు నా కుమారుడు గానీ కుమార్తె గానీ అవినీతికి పాల్పడినా జైలుకు పంపుతాం. ప్రజాధనాన్ని కైంకర్యం చేసే మోసగాళ్లు, దోపిడీదారులు, నేరస్తుల పట్ల కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. విడిచిపెట్టే ప్రసక్తే లేదు’’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. పవన్‌కళ్యాణ్, విజయశాంతి, సర్వేకు సహకరించలేదన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. తెలంగాణలో ఉంటూ తమ సమాచారాన్ని ఇవ్వనివారు ఇక్కడ పర్యాటకులుగా ఉండాలన్నారు. వివరాలను తప్పుగా ఇచ్చినవారిపైనా చర్యలు ఉంటాయన్నారు.
 
 ముంపు గ్రామాలది ముగిసిన కథ: సీఎం
 
 సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలది ముగిసిన కథ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ముంపు గ్రామాల్లో సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. లోక్‌సభ, రాజ్యసభల ఆమోదంతోపాటు, రాష్ట్రపతి కూడా దీనికి ఆమోదముద్ర వేసినందున అది ముగిసిన అధ్యాయమన్నారు. ‘ఈ ముంపు గ్రామాల గురించి ఇప్పుడు ఏమి చేయలేం బ్రదర్. అవి పక్క రాష్ట్రానికి వెళ్లినందున అక్కడ సర్వే నిర్వహించలేక  పోయాం’ అని చెప్పారు.
 
 ముస్లిం యువతుల పెళ్లికి రూ. 51 వేలు..
 
 ‘ముస్లిం యువతులకు ప్రస్తుతం పెళ్లి సందర్భంగా రూ.25 వేలతో జుమ్మెరాత్ బజార్లో సెకండ్‌హ్యాండ్ సామాన్లు ఇస్తున్నారు. ఈ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.25 వేలను రూ. 51 వేలకు పెంచాలని నిర్ణయించాం. రూ.51 వేలతో సామాగ్రి కాకుండా.. ఆ మొత్తాన్ని పెళ్లికుమార్తె బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తాం. కళ్యాణలక్ష్మి పథకం కింద దళిత, గిరిజన యువతులకు రూ. 50 వేలు ఇవ్వాలని ఇదివరకు మంత్రిమండలి నిర్ణయించింది. దానిని కూడా రూ.51 వేలకు పెంచుతున్నాం’ అని కేసీఆర్ చెప్పారు.
 
 తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం...
 
 ‘తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం సింగపూర్, మలేషియా దేశాల పర్యటనకు వెళ్తున్నా. ఈనెల 25వ తేదీ వరకు ఈ రెండు దేశాల్లో అధికారులతో కలిసి పర్యటిస్తున్నా. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడానికి రావాల్సిందిగా దేశంలోని ముఖ్యమంత్రుల్లో నా ఒక్కరికే ఆహ్వానం వచ్చింది. కొత్త రాష్ట్రం కొత్త ముఖ్యమంత్రి అన్న ఉద్దేశంతో పంపించారు. మలేషియాలో అద్భుత రీతిలో అభివృద్ధి జరిగింది. ఎలా సాధించారన్న అంశాన్ని పరిశీలిస్తాం. అక్కడి అధికారులు, మంత్రులతో సమావేశమవుతాం. సింగపూర్ నుంచి కౌలాలంపూర్‌కు కారులోనే వెళ్తాను. అలా వెళ్తేనే అక్కడి పట్టణాలు ఎలా అభివృద్ధి చెందాయో అవగాహన వస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో జీరో అవినీతి అమలు చేస్తామని, పరిశ్రమలకు ఎలాంటి అవినీతి లేకుండా అన్ని అనుమతులు అందిస్తామన్నారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమావేశంలో సింగపూర్ ప్రధాని కూడా పాల్గొంటారు.
 
 
 నేడు ప్రభుత్వ సాధారణ సెలవుదినం
 
 మంగళవారం జరిగిన సమగ్ర సర్వే దష్ట్యా బుధవారాన్ని సాధారణ సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు పనిచేయవు. ఎన్యుమరేటర్లంతా వ్యయప్రయాసలకు ఓర్చి సమాచార సేకరణ విధుల్లో పనిచేశారంటూ కేసీఆర్ వారికి కతజ్ఞతలు తెలిపారు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సర్వే సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నందున వారందరికీ సెలవు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement