ఒక్క క్లిక్‌తో ఇంటిగుట్టు | mass household survey to be held on 19th | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో ఇంటిగుట్టు

Published Sat, Aug 2 2014 1:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

ఒక్క క్లిక్‌తో ఇంటిగుట్టు - Sakshi

ఒక్క క్లిక్‌తో ఇంటిగుట్టు

19న ‘సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’..
పకడ్బందీ ఫార్మాట్‌తో వివరాల సేకరణ
కులం, మతం, ఇళ్లు, ఆస్తిపాస్తుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల దాకా..
విద్యార్హతలు, ఉద్యోగం నుంచి పొందుతున్న సబ్సిడీల దాకా నమోదు
తప్పుడు సమాచారమిస్తే  ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలకు అనర్హతే
కుటుంబ యజమానితో ధ్రువీకరణ సంతకం
4 లక్షల మందితో ఒకే రోజు నిర్వహణ.. ఎన్నికల తరహాలో ఏర్పాట్లు
పోలీసు సిబ్బందితోనూ (సివిల్ దుస్తుల్లో) సర్వే
సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రభుత్వ ముద్రతో స్టిక్కర్!
19న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు..
సర్వేపై 11న ఎన్యూమరేటర్లు, రిసోర్స్ పర్సన్లకు శిక్షణ

 
సాక్షి, హైదరాబాద్:
ఒక్క క్లిక్ చేస్తే చాలు.. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలూ ఆవిష్కృతమవుతాయి. కుటుంబంలోని వారికి ఉన్న ఇళ్లు, ఆస్తిపాస్తుల నుంచి.. ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులున్నాయా? అనే అంశం దాకా పూర్తి వివరాలు తెలిసిపోతాయి. రేషన్, ఆధార్ కార్డుల వివరాల నుంచి ఆదాయపన్ను దాకా... మొత్తంగా చెప్పాలంటే కుటుంబం చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించనున్న ‘సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’లో సేకరించనున్న వివరాల ఫార్మాట్ ఇది.. ఐదు పేజీలున్న ఈ ఫార్మాట్‌లో కుటుంబ సభ్యుల పేర్లు, కులం, మతం, రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు, గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్లతో పాటు విద్యార్హతలు, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, పొందుతున్న సబ్సిడీలు, పెన్షన్లు, చెల్లిస్తున్న ఆదాయపన్ను వంటి అంశాలు, స్థిరచరాస్తులు, పశు సంపద వివరాలనూ పొందుపర్చాల్సి ఉంది. అంతేగాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏవైనా వ్యాధులున్నాయా? అందులో కేన్సర్, గుండె జబ్బు,  క్షయ, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారెవరున్నారు? అనే వివరాలను కూడా నమోదు చేసేలా ఫార్మాట్‌ను రూపొందించారు.

జిల్లాకు రెండు కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19వ తేదీన అన్ని జిల్లాల్లో ‘సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’ నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు రాత్రి 8.30 వరకూ హెచ్‌ఐసీసీలో సుదీర్ఘంగా జరిగిన సదస్సులో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్వే నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ. రెండు కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంటింటి సర్వే చేసే ఎన్యుమరేటర్లకు, రిసోర్స్ పర్సన్లకు ఈ నె ల 11వ తేదీన ఆర్డీవో కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించని వారిని కూడా ఈసారి సర్వే కోసం వినియోగించుకోనున్నారు. ఆ డేటాబేస్ మొత్తం సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు. 19వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తయినట్లు ఆయా ఇళ్లకు తెలంగాణ రాష్ట్ర ముద్ర స్టిక్కర్ వేయాలని వచ్చిన ప్రతిపాదనకు సీఎం స్పందిస్తూ.. బాగానే ఉంటుందని పేర్కొన్నారు.
 
యుద్ధ ప్రాతిపదికన..
అత్యంత పకడ్బందీగా చేపడుతున్న ఈ సర్వేను ఒక్కరోజులోనే పూర్తి చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. ఒక్కో ఉద్యోగి సగటున 20 నుంచి 25 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించారు. సర్వేకు పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమైనందున ఇందులో పోలీసులను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా సివిల్ దుస్తుల్లో పోలీసులు సర్వే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సర్వే సిబ్బందికి రవాణా, వసతి, భోజన సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా రవాణా సమస్య తలెత్తకుండా ఉండేందుకు.. సర్వే నిర్వహించే రోజున అవసరమైన మేరకు ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఎంగేజ్ చేసుకునే పనిలో పడ్డారు.
 
పోలింగ్ తరహాలో..
సమగ్ర కుటుంబ సర్వే కోసం ఎన్నికల పోలింగ్ తరహాలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోనుంది. తాము ఏగ్రామంలో, ఏయే కుటుంబాలను సర్వే చేయబోతున్నామనే సంగతిని సర్వే సిబ్బందికి చివరి నిమిషం వరకు తెలియనివ్వరు. 19వ తేదీన ఉదయానికల్లా ప్రత్యేక వాహనాల్లో ఉద్యోగుల(ఎన్యుమరేటర్ల)ను సర్వే నిర్వహించాల్సిన గ్రామంలో దించుతారు. ఆ వెంటనే వారు ఏయే కుటుంబాల ఇళ్లకు వెళ్లి సర్వే చేయాలో తెలిపే జాబితాను ఎన్యుమరేటర్లకు అధికారులు అందజేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలను సేకరించి తిరిగి అదే వాహనంలో సాయంత్రానికి మండల కేంద్రానికి వెళ్లి అక్కడున్న అధికారులకు అందజేయాలి. పోలింగ్ రోజున ఓటింగ్ యంత్రాలను మండల కేంద్రాల్లో అప్పగించిన తరహాలోనే ఎన్యుమరేటర్లు కూడా సర్వే పత్రాలను అందచేయాల్సి ఉంటుంది. ఆ సర్వే పత్రాల్లోని సమాచారాన్ని కంప్యూటర్ ఆపరేటర్లు కంప్యూటర్‌లో నమోదు చేసి మండల అధికారి నుంచి జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు సహా ముఖ్యమంత్రి కార్యాలయాలకు అనుసంధానం చేస్తారు.
 
తప్పుడు సమాచారమిస్తే అనర్హులే..
సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్‌లో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే సదరు లబ్ధిదారుడు ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీని రద్దుచేయడంతో పాటు భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు పొందేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు. సదరు సర్వే ఫార్మాట్‌లోని చివరి పేజీలో ఈ ధ్రువీకరణను కూడా పొందుపరిచి కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. దీంతోపాటు సదరు కుటుంబ యజమాని వెల్లడించిన వివరాలన్నీ నిజ మా? కాదా? అని నిర్ధారించుకోవాల్సిన బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఒకవేళ అధికారులు తప్పు చేశారని భావిస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
 
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దు..
సర్వే సమయంలో కాని, సర్టిఫికేట్ల మంజూరు సమయంలో కాని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఒకసారి పోస్టింగ్ అయిన అధికారులను రెండేళ్ల వరకు కదిలించబోమని కూడా ఆయన మరోమారు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement